వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు ఎవరూ అంటే.. వేళ్ల మీద లెక్కపెట్టే వారు మాత్రమే ఉంటారు. రాజకీయ నేతల కంటే కూడా.. బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ ఉద్యోగులనే ఎక్కువగా నమ్ముతారు జగన్. అందుకే అలాంటి వాళ్లు ఎక్కడ ఉన్నారో వెతుక్కుని మరీ తన ప్రభుత్వంలో స్థానం కల్పించారు. ఇంకా చెప్పాలంటే తన అవినీతికి సహకరించిన వారిని అందలం ఎక్కించారు. అలాంటి వారిలో అగ్రస్థానంలో ఉన్న అధికారి శ్రీలక్ష్మి.
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే జగన్ అక్రమాస్తుల కేసులో కీలక ముద్దాయి కూడా. ఓబుళాపురం మైనింగ్ కేసులో జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతం బెయిల్‌పైన ఉన్న శ్రీలక్ష్మి గురించి దాదాపు అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నేతలు ఈమె అవినీతిని గట్టిగానే నిలదీశారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పరిమితమయ్యారు శ్రీలక్ష్మి. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీలక్ష్మిని ఏపీకి డిప్యూటేషన్ మీద బదిలీ అయ్యారు. అలా వచ్చిన వెంటనే.. కీలకమైన మునిసిపల్ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వం మారిన తర్వాత శ్రీలక్ష్మిని కూటమి ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేసింది.
Also Read : ముంతాజ్ హోటల్ కు టిటిడి భూమి.. బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా వైసీపీ భుత్వంలో కొనసాగిన శ్రీలక్ష్మిపై ఇప్పుడు జగన్ అత్యంత ఆప్తులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది కూడా. అయితే ఈ వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
వీటిపై గళం పిప్పిన భూమన.. టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకు అయినా సిద్ధమే అంటూ సవాల్ చేశారు. గతంలో ఓ ఐఏఎస్ అధికారి అవినీతిలో అనకొండ మాదిరిగా వ్యవహరించారని ఆరోపించారు. చివరికి మంత్రులను కూడా లెక్క చేయలేదని.. తన శాఖ మంత్రులకు కూడా కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం డబ్బు సంపాదన మీద మాత్రమే దృష్టి పెట్టారని.. కనీస నైతిక విలువలు కూడా అధికారిలో లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు భూమన.
Also Read : ఏపీ బార్ పాలసీ ఫెయిల్.. ఆసక్తి చూపని వ్యాపారులు.. కారణం అదేనా..?
టీడీఆర్ బాండ్ల ద్వారా గతంలో తిరుపతిలో కూడా దోచుకోవాలని చూస్తే.. తాను అడ్డుపడినట్లు భూమన వ్యాఖ్యానించారు. అలా అడ్డుకున్నందుకే తనపై అవినీతి ఆరోపణలు చేశారని ఆరోపించారు. 35 ఏళ్ల సర్వీసులో వందల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని.. ఆ అధికారి కట్టే ఒక్కొక్క చీర కనీసం లక్ష నుంచి లక్షన్నర వరకు ఉంటుందని భూమన ఆరోపించారు. అధికారి అవినీతి సుప్రీం కోర్టుకు కూడా తెలుసన్నారు. దీంతో శ్రీలక్ష్మీపై భూమన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి భూమన, శ్రీలక్ష్మీ ఇద్దరూ జగన్‌కు అత్యంత సన్నిహితులే. అలాంటి భూమనే.. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.