ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు విశాఖపట్నం పోలీసులు అనుమతి ఇచ్చారు. మెడికల్ కాలేజీ అంశానికి సంబంధించి మాకవరపాలెం లో జగన్ పర్యటించనున్నారు. గత కొన్నాళ్లుగా ఈ అంశానికి సంబంధించి తీవ్రస్థాయిలో రాజకీయంగా రచ్చ కొనసాగుతోంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్నీ తప్పుపడుతున్న వైసిపి ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేస్తూ వచ్చింది.
Also Read : ఫైబర్ ఎన్ని రకాలు..? ఎక్కువ ఫైబర్ తీసుకుంటే ఏమవుతుంది..?
అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతులు లేకుండా మెడికల్ కాలేజీలు.. ఏ విధంగా నిర్మిస్తారని ప్రశ్నించిన నేపథ్యంలో నేరుగా జగన్ రంగంలోకి దిగారు. ఈ నేపద్యంలో నర్సీపట్నం పర్యటనకు జగన్ రంగం సిద్ధం చేసుకోగా.. మొత్తం 63 కిలోమీటర్లు రోడ్ షో చేయాలని భావించారు. అయితే ఇటీవల జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు జగన్ కు అనుమతి నిరాకరించారు. అయితే తాజాగా రూట్ మార్చి అనుమతి ఇచ్చారు పోలీసులు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి, సరిపల్లి, మీదుగా జాతీయ రహదారి నుంచి అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా మాకవరపాలెం వెళ్లాలని తాజా ఆదేశాల్లో విశాఖ సిపి స్పష్టం చేశారు.
Also Read : విజయ్ దేవరకొండ యాక్సిడెంట్ వెనుక అసలు కారణం ఇదేనా?
అలాగే జగన్ వాహన శ్రేణిలో పది వాహనాలకు మించి ఉండకూడదని స్పష్టం చేశారు పోలీసులు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతి రద్దు చేయడంతో పాటుగా సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తామని.. ఏదైనా ఘటన జరిగిన, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లినా సరే నిర్వాహకుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీనితో రేపటి పర్యటనపై ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 9న మహిళల ప్రపంచ కప్ మ్యాచ్ కూడా వైజాగ్ లో ఉన్న నేపథ్యంలో మరి జగన్ పర్యటన విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి.