ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రైవేటు పీఏపై వేటు పడింది. పదేళ్లుగా అనిత దగ్గరే పనిచేస్తున్న జగదీష్… అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కావాల్సినంత వెనకేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కంటే కూడా.. హోమ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగదీష్ పెత్తనం బాగా పెరిగిపోయిందనేది బహిరంగ రహస్యం. అదేదో సామెత చెప్పినట్లు.. దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనే సామెత మాదిరిగా… హోమ్ మంత్రి కంటే… పీఏ జగదీష్ మాటే ఫైనల్ అన్నట్లుగా ఇన్నాళ్లు సాగింది. చివరికి జగదీష్ ఆగడాలు తారాస్థాయికి చేరడంతో.. తొలగించినట్లు స్వయంగా మంత్రి వంగలపూడి అనిత తన సొంత నియోజకవర్గం పాయకారావుపేట కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. అలాగే పార్టీలోని ఇతర తెలుగు మహిళ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, నాయకులకు స్వయంగా ఫోన్ చేసిన హోమ్ మంత్రి అనిత.. ఇకపై జగదీష్‌కు ఎలాంటి ఫోన్లు చేయవద్దని కూడా చెప్పారట.
జగదీష్ అవినీతి తారాస్థాయిలో ఉందనే మాట కంటే కూడా… పార్టీ నేతలపై పెత్తనం ఎక్కువైందనే మాట బాగా వినిపిస్తోంది. ప్రధానంగా కిందిస్థాయి నేతలు, కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు. అలాగే వారు ఏదైనా పని కోసం అనితను కలిసేందుకు ప్రయత్నిస్తే… అడ్డుకున్నాడనేది జగదీష్‌పై ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. చివరికి తెలుగు మహిళా నేతలకు కూడా హోమ్ మంత్రి అపాయింట్‌మెంట్ దక్కకుండా చేశాడు. ఈ విషయంపై నేరుగా హోమ్ మంత్రి కూడా గతంలో జగదీష్‌కు వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతని తీరులో ఎలాంటి మార్పు రాలేదు.
Also Read : రిపోర్ట్ ఏది..? ఎన్ని సార్లు అడగాలి..? చంద్రబాబు సీరియస్
ఇవన్నీ ఒకెత్తు అయితే జగదీష్ అవినీతి, పెత్తనంపై కొంతమంది సీనియర్ నేతలు నేరుగా సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోదరుని కుమారుడు డా.రవిశంకర్‌కు చెందిన ఆసుపత్రిపై వైసీపీ గూండాలు దాడి చేశారు. ఈ దాడిపై పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండోరోజు ఉదయం రాజమండ్రి పోలీసులకు ఫోన్ చేసిన జగదీష్ వారిని వదిలిపెట్టాల్సిందిగా ఆదేశించాడంట. ఈ విషయంపై మేడం కూడా చాలా సీరియస్‌గా ఉన్నారని వార్నింగ్ ఇవ్వడంతో.. తప్పని పరిస్థితుల్లో వారిని పోలీసులు వదిలేశారు. ఈ విషయంపై బుచ్చయ్య చౌదరి నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారట. దీంతో ఈ విషయంపై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ అధికారులను సీఎం ఆదేశించడంతో జగదీష్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read : టీడీపీలో సీనియర్లకు గుర్తింపు ఏదీ..?
నియోజకవర్గంలో దందాలు నిర్వహిస్తున్న జగదీష్… హోమ్ మంత్రి పేరుతో ఇప్పటికే 50 వరకు తిరుమల శ్రీవారి దర్శనం సిఫారసు లేఖలను టీటీడీకి పంపినట్లు తెలుస్తోంది. వీటి జారీ కోసం భారీగానే వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. జగదీష్‌పై నియోజకవర్గం నేతలు గతంలోనే వంగలపూడి అనితకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవడంతో.. తప్పని పరిస్థితుల్లో జగదీష్‌ను తొలగించినట్లు హోమ్ మంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. అయితే దాదాపు పదేళ్లుగా అనిత దగ్గరే పని చేస్తున్న జగదీష్‌ను అంత ఈజీగా తప్పించే పరిస్థితులు లేవనేది సన్నిహితుల మాట. కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా పక్కన పెడతారు తప్ప.. జగదీష్‌ను అనిత అంత తేలికగా వదులుకునే పరిస్థితి లేదంటున్నారు పార్టీ నేతలు.