ఆంధ్రప్రదేశ్ లో అన్ని శాఖల్లో అవినీతిని బయటకు లాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కార్పోరేషన్ ల మీద కూడా దృష్టి పెట్టింది. ఒక్కో కార్పోరేషన్ లో ఏ మేర అవినీతి జరిగింది అనే వివరాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల మీద కూడా దృష్టి సారించి వెంటనే విచారణకు ఆదేశిస్తున్నారు. గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో తమ మనుషులను నియమించుకున్న జగన్ సర్కార్… భారీగా అవినీతికి పాల్పడింది అన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ లేదు ఈ శాఖ లేదు.. చివరికి ఫైబర్ గ్రిడ్ లో కూడా అవినీతి జరిగింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండికొట్టారు అని తీవ్ర ఆరోపణలు ఉన్న నేపధ్యంలో దీని పై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు రావడంతో కీలక నిర్ణయం తీసుకోనుంది.
అసలు ఫైబర్ గ్రిడ్ ని పూర్తిగా నీరు గార్చేసింది జగన్ సర్కార్. దీనితో చాలా మంది డీటీహెచ్ లకు మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక అసలు ఫైబర్ గ్రిడ్ లో ఎంత అవినీతి జరిగింది అనే దాని మీద సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ మాజీ ఎండి ఎం మధుసూదన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో కనెక్షన్ 199 ఉన్నప్పుడు నెలకు రాబడి 17 కోట్లు ఉంది. కాని కనెక్షన్ 599 రూపాయలు చేసినప్పుడు నెల రాబడి పన్నెండు కోట్లు మాత్రమే ఉంది.
టిడిపి ప్రభుత్వంలో తొమ్మిది లక్షల డెబ్భై వేల ఫైబర్ గ్రిడ్ కలెక్షన్లు ఉండగా… ఆ కనెక్షన్లను నాలుగు లక్షలు మాత్రమే చూపించిన మధుసూదన్ రెడ్డి.. 200 కోట్ల రూపాయల పైగా కుంభకోణం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మూడు రోజుల క్రితం సిఎస్ కి టిడిపి నేతలు ఫిర్యాదు చేసారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ అక్రమాలపై సిఐడి విచారణ కు ఆదేశించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇందులో కీలక వైసీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సదరు నాయకులందరూ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.