ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు. గతానికి పూర్తి భిన్నంగా పూర్తిస్థాయి కేబినెట్‌ను చంద్రబాబు ముందే ప్రకటించారు. మంత్రివర్గం సభ్యులంతా సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ప్రమాణస్వీకారం చేశారు. పరిపాలన పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో అంతా బాగానే ఉన్నా… ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండగా… మరికొందరి తీరుపై విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో ఏపీ సర్వనాశనమైందని… దానిని పునర్‌నిర్మిస్తున్నామని ఓ వైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రతిరోజు చెబుతుంటే… కొందరు కూటమి మంత్రులు మాత్రం మళ్లీ అవకాశం రాదేమో అనేలా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: విశాఖ కు మోడీ.. ఏపీ కి వరాలిస్తాడా..?
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు… ఇప్పటి వరకు కనీసం పది మంది మంత్రులపైన ఆరోపణల వచ్చాయి. అందరికంటే ముందుగా మంత్రి అచ్చెన్నాయుడు తీరును సొంత పార్టీ నేతలు, శ్రీకాకుళం జిల్లా మీడియా మిత్రులు తప్పుబట్టారు. పైగా అచ్చెన్నాయుడు పీఏ అవినీతి చేస్తున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో అచ్చెన్నాయుడు పెత్తనం మితిమీరిపోయిందనేది ప్రధాన ఆరోపణ. ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి వంగలపూడి అనిత. పదేళ్లుగా తన వద్ద పని చేస్తున్న ప్రైవేటు పీఏ అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో తొలగించినట్లు అనిత స్వయంగా ప్రకటించారు. పార్టీ నేతలను కూడా అనిత పట్టించుకోవడం లేదని… పీఏ జగదీష్ గురించి అనితకు ముందే తెలుసనేది మరో ఆరోపణ.
Also Read: తురగా కిషోర్ బెండు తీస్తారా..?
ఇక తాజాగా తెలంగాణలో పెత్తనం చేస్తున్న ఏపీ డార్లింగ్ మంత్రి అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం పెద్ద దుమారం రేపింది. ఈ కథనం మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను టార్గెట్ చేస్తూ రాసిందే అనేది బహిరంగ రహస్యం. ఈ కథనంపై ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ అనుచరులు సైతం సోషల్ మీడియాలో సదరు పత్రికా యజమానిపై విమర్శలు చేస్తున్నారు. ఇదే తరహాలో పలువురు మంత్రులపై ఆరోపణలు కూటమి సర్కార్‌ను ఇబ్బందులు పెడుతున్నాయి. కొన్నిచోట్ల ఇసుక, మద్యం వ్యాపారాల్లో మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు స్థానిక నేతలు. దీనిపై ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: రెచ్చిపోతున్న వెంకట్రామిరెడ్డి.. బాబు సర్కార్ ని అవమానించడమేనా?
గతంలో పార్టీ నేతల సమావేశంలో కూడా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వ్యాపారంలో వేలు పెడితే… తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు కూడా. అయినా సరే… కొందరు నేతలు మాత్రం తీరు మార్చుకోలేదనేది పార్టీ నేతల మాట. మెజారిటీ ఎమ్మెల్యేలు మద్యం, ఇసుక, రేషన్ బియ్యం విషయంలో అనవసర పెద్దరికం చేస్తున్నట్లు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి పార్థసారధి వ్యవహారశైలి పై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తుంది. ఆయన టిడిపిలో ఉన్నా ఆయన చుట్టూ ఉంటుంది మాత్రం వైసీపీ నాయకులే అని, వైసీపీ వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దీంతో సాధ్యమైనంత త్వరలోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందనే మాట ప్రస్తుతం పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇందులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం.