వైసీపీ కంచుకోట.. అక్కడ టీడీపీ గెలిచిందే లేదు.. అప్పట్లో కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీ.. కూటమి ప్రచండ గాలిలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించారంటే.. అక్కడ వైసీపీ బలంగా ఉంది అనే మాట కంటే కూడా.. ఆ నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు ప్రధాన కారణం. అయితే వైసీపీ విజయం సాధించి ఇప్పటికి పది నెలలైంది. అయినా సరే.. నియోజకవర్గం అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఆ నియోజకవర్గంలో వైసీపీ తాజా, మాజీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పంచాయతీ చివరికి జిల్లాకు చెందిన సీనియర్ నేత దగ్గరకు చేరుకుంది కూడా. జిల్లాలో హేమాహేమీలను తట్టుకుని నిలబడ్డ మాజీ నేత.. ప్రస్తుత ఎమ్మెల్యే పై అక్కసుతో రగిలిపోతున్నారు కూడా.
Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ కంచుకోట. నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున ఆదిమూలపు సురేష్ తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014లో వైసీపీ తరఫున పాలపర్తి డేవిడ్ రాజు పోటీ చేసి గెలవగా.. సురేష్ మాత్రం సంతనూతలపాడు షిఫ్ట్ అయ్యారు. మళ్లీ 2019లో యర్రగొండపాలెం వచ్చేశారు. వరుసగా మూడు సార్లు గెలిచిన సురేష్‌కు ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు జగన్. దీంతో జిల్లాలో నేనే సీనియర్ అని కూడా చెప్పుకున్నారు. అయితే 2024 ఎన్నికల నాటికి సురేష్‌కు జగన్ షాక్ ఇచ్చారు. యర్రగొండపాలెం నుంచి కొండపికి మార్చారు. కొండపిలో సురేష్, యర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి గెలవటంతో.. ప్రస్తుతం యర్రగొండపాలెంలో సురేష్ మాట ఎవరూ లెక్క చేయటం లేదు. దీంతో నియోజకవర్గంలో తన పట్టుపోతుందని భయపడుతున్నారు ఆదిమూలపు సురేష్.
Also Read : తిరుమల ఘటనపై బీఆర్ నాయుడు సంచలనం
నెల రోజుల క్రితం త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. దీంతో జిల్లాలోనే కాదు.. అటు జగన్ దగ్గర కూడా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు మంచి పేరు వచ్చిందనేది వైసీపీ నేతల మాట. ఇదే ఆదిమూలపు సురేష్ ఆగ్రహానికి కారణం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో తనపట్టు నిలుపుకునేందుకు సురేష్ ఇప్పుడు తెగ తాపత్రయ పడుతున్నారు. వాస్తవానికి ఎంపీపీ ఉప ఎన్నిక సమయంలో సురేష్ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా పావులు కదిపారు అనేది బహిరంగ రహస్యం. అయినా సరే.. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గెలిచారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సురేష్.. కక్షసాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
Also Read : బ్రేకింగ్: గోరంట్ల వ్యవహారంలో పోలీసులకు బిగ్ షాక్
త్రిపురాంతకం ఎంపీటీసీ సృజన చెల్లెలు వసుంధరను జార్జ్ కళాశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు చెందిన జార్జ్ కళాశాలలో ఎంపీటీసీ సృజన సోదరి వసుంధర అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన చల్లా జ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ ఎన్నికలో మాత్రం.. ఎంపీటీసీ సృజన వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకపోవడంతోనే సృజన సోదరిని విధుల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో హైకమాండ్ ఆదిమూలపు సురేష్‌కు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని ఒప్పుకున్న సురేష్.. తిరిగి విధుల్లో చేరాలని వసుంధరను కోరారట. అలాగే పెద్దమొత్తంలో వారికి డబ్బు ఇచ్చేందుకు సిద్దమైనప్పటికీ.. సృజన కుటుంబ సభ్యులు మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
Also Read : వైసీపీ టాపిక్ డైవర్షన్ పాలిట్రిక్స్..!
అలాగే ఎన్నికల తర్వాత టీడీపీకి మద్దతు ఇచ్చిన మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని తీసుకుని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లిన ఆదిమూలపు సురేష్‌కు… అక్కడ కూడా చీత్కారాలే ఎదురైనట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని… మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని సురేష్ క్షమాపణ అడిగినట్లు సమాచారం. అయితే వైవీ సుబ్బారెడ్డి మాత్రం సురేష్‌కపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నిక సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను ఎలా తీసుకువస్తారని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. యర్రగొండపాలెం విషయంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదిమూలపు సురేష్‌ను వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారట. దీంతో చేసేది ఏం లేక ఆదిమూలపు సైలెంట్‌గా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో తన ప్రాభవం తగ్గుతోందనేది ఆదిమూలపు సురేష్ భయం.

