రాజకీయాల్లో, సినిమాల్లో సెంటిమెంట్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ముహూర్తం లేకుండా షూటింగ్ మొదలుపెట్టరు… శకునం చూడకుండా నేతలు అడుగు కూడా బయటపెట్టరు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే.. సెంటిమెంట్‌దే ఫైనల్. అలాంటిది ఏదైనా నెగిటివ్ జరిగితే.. ఇక ఆ వైపు కూడా కన్నెత్తి చూడరు. అలాంటి భయమే విశాఖ వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఆ పదవే విశాఖ జిల్లా అధ్యక్ష పదవి. మొత్తం ఆరు నియోజకవర్గాల పరిధిలో ఉండే వైసీపీ అధ్యక్ష పదవి తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లా మొత్తంపైన పెత్తనం చేసే అవకాశం ఉన్నప్పటికీ… మాకొద్దు బాబోయ్ అనేస్తున్నారు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు. ఇందుకు ప్రధాన కారణం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అధ్యక్ష స్థానంలో ఉన్న వారికి జరిగిన అనుభవాలే కారణమంటున్నారు.
Also Read : అమరావతిలో చేపల చెరువులు, జగన్ మరో ఘనత…!
ఇటీవల వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను చోడవరం నియోజకవర్గానికి బదిలీ చేశారు. వాస్తవానికి గుడివాడ అమర్నాథ్ సొంత నియోజకవర్గం అనకాపల్లి. అయితే 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత కూడా గాజువాక ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు జగన్. అయితే మూడు నెలలు కూడా తిరక్క ముందే అమర్నాథ్‌ను గాజువాక నుంచి చోడవరం మార్చేశారు. ఇదంతా గుడివాడ కోరిక మేరకే జరిగిందనేది పార్టీలో వినిపిస్తున్న మాట. అయితే సెంటిమెంట్‌లో భాగంగానే స్థాన చలనం జరిగిందనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. వాస్తవానికి జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన నేతలకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. విశాఖ అర్బన్ వైసీపీ అధ్యక్షుడిగా పని చేసిన వంశీకృష్ణ యాదవ్ 2014 ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడారు. 2019లో సీటు కూడా రాలేదు. మేయర్ పదవి వస్తుందని ఆశించినప్పటికీ.. అది జరగలేదు. ఎమ్మెల్సీ పదవి వచ్చినా… పార్టీలో అంతర్గత విబేధాల కారణంగా వైసీపీకి వంశీ గుడ్ బై చెప్పేశారు.
Also Read : సరస్వతికి షాక్ ఇచ్చిన సర్కార్.. 25 ఎకరాలు లాగేశారు…!
ఇక పంచకర్ల రమేష్ బాబుది కూడా ఇదే పరిస్థితి. పెందుర్తి టికెట్ ఆశించి వైసీపీలో చేరిన రమేష్‌కు జగన్ షాక్ ఇచ్చాడు. మరోసారి అదీప్‌రాజ్‌కే అవకాశం ఇచ్చాడు. ఇందుకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవే కారణమని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇక నగర పార్టీ బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఇక సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా అధ్యక్ష కుర్చీ బాధితుడే. వరుస విజయాలతో జోరు మీదున్న అవంతి.. తొలిసారి ఓడిపోయారు. పైగా అవంతి ఆడియో వైరల్ అవ్వడంతో కావాల్సినంత చెడ్డపేరు కూడా వచ్చింది. చివరికి వైసీపీకి గుడ్ బై కూడా చెప్పేశారు అవంతి. అయితే అందరికంటే ఎక్కువ దురదృష్ట వంతులు ఎవరంటే.. కోలా గురువులు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఒక్క ఓటుతో చట్టసభలో అడుగుపెట్టాలనే కోరికకు గండి పడింది. డీసీసీబీ అధ్యక్ష అవకాశం వచ్చినా… అక్కడితోనే కోలా గురువులు రాజకీయా ప్రయాణం ఆగిపోయింది. ఇవన్నీ వైసీపీ నేతల్లో నెగిటివ్ సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ఇక గుడివాడ అమర్నాథ్‌కు చోడవరం బాధ్యతలు అప్పగించడంతో… ఆయన స్థానంలో విశాఖ అధ్యక్ష పీఠం ఎవరికి ఇస్తారో అనే భయం ప్రస్తుతం విశాఖ జిల్లా నేతలను భయపెడుతోంది. ఇలా ఇస్తే మాత్రం… వారి రాజకీయ జీవితం భూస్థాపితం అయినట్లే అంటున్నారు.