పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే కూడా వారి బంధువులే కీలకంగా చక్రం తిప్పుతున్నారు. మరీ ముఖ్యంగా అమాత్య పదవుల్లో ఉన్న నేతల బంధువులైతే… ఏకంగా అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. అధికారులతో సమీక్షలు మొదలు… ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం, ప్రారంభోత్సవాలు కూడా ప్రజాప్రతినిధుల సోదరులు, బంధువులే కానిచ్చేస్తున్నారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే… మీకు కావాల్సిన పని జరుగుతుంది కదా… అని కూడా చెప్పేస్తున్నారు.
Also Read: ఏపి అసెంబ్లీలో సత్తా చాటుతున్న మహిళా ఎమ్మెల్యేలు
వాస్తవానికి అధికారంలో ఉన్న నేతల బంధువులు చక్రం తిప్పటం ఇప్పుడు కొత్తగా ఏం లేదు కదా అని కూడా అనేస్తున్నారు కొందరు నేతలు. ఐదేళ్ల తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. కొందరు నేతల బంధువులైతే… నియోజకవర్గంలో తన మాటే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు.
Also Read: పోయిరా నేస్తమా… రాజకీయ గురువుకు కన్నీటి వీడ్కోలు..!
నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎన్నికయ్యారు కూడా. బీసీ సామాజిక వర్గం నేత కావడంతో చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రి పదవి దక్కించుకున్నారు కూడా. మంత్రిగా అమరావతిలో బిజీబిజీగా గడిపేస్తున్న సత్యప్రసాద్ బదులుగా రేపల్లె నియోజకవర్గంలో ఆయన సోదరుడు శివప్రసాద్ చక్రం తిప్పుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు అధికారిక కార్యక్రమాల్లో కూడా శివప్రసాద్ పాల్గొంటున్నారు. అదేమంటే… నా పేరులో కూడా ప్రసాద్ ఉంది కదా.. అంటూ నవ్వేస్తున్నారు.
Also Read: జగన్ కు టిట్ ఫర్ టాట్… బాబు వ్యూహం భేష్
ఇక మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరులు కీలకంగా మారిపోయారు. మునిసిపల్ మార్కెట్ షాపుల టెండర్లు తాము చెప్పిన వారికే ఇవ్వాలని సూచించారు. ఇక ప్రారంభోత్సవాల్లో కూడా జనసేన నేతలను కాదని… వీరికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. ఆర్టీసీ బస్సులు, అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవంతో పాటు నియోజకవర్గంలో ఏ చిన్న పని కావాలన్నా సరే.. ముందుగా ఇద్దరు సోదరులను సంప్రదించాల్సిందే అనేది బహిరంగ రహస్యం.
Also Read: పోసానికి మూడింది..!
అటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త, సోదరుడు కూడా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సొంత పార్టీ నేతల్లోనే కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీ నేత మాట వినాలా… లేక బంధువుల మాట వినాలా అని విసుక్కుంటున్నారు కూడా. దీనిపై అధినేత దృష్టి సారించాలని కోరుతున్నారు.