సూపర్‌సిక్స్‌లో మొదటి పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెండు పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజల నుంచి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణంలో మహిళకు కల్పించే కార్యక్రమాన్ని డిసెంబర్‌లో శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రకటించారు. కూటమిలోని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులతో పాటు.. మిగతా నేతలు సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన వారు గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్న వెంటనే వారి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు, ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
మరోవైపు సూపర్‌సిక్స్‌లో అత్యంత కీలకమైన తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని జనం కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 42 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేశారు. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అని చెప్పి.. చివరకు ఒక్కరికే పరిమితం చేశారు జగన్. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాకముందు మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్‌లో తల్లికి వందనం కింద.. ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికి 15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా 82 లక్షల మంది విద్యార్థులు జూనియర్ కాలేజీలు, స్కూల్స్‌లో చదువుతున్నారు. వీరందరికీ 15 వేలు చొప్పున ఇవ్వాలంటే.. పన్నెండు వేల కోట్లు అవసరం ఉంది. ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : వార్నింగ్ ఇస్తున్నా పట్టించుకోని ఎమ్మెల్యేలు
సూపర్‌సిక్స్‌లో అన్నదాత సుఖీభవ కింద మరో కీలక పథకాన్ని ప్రకటించారు. రైతులకు పెట్టుబడి కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ.. డబ్బులు ఇంకా రాకపోవడంతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 50 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.3,750 కోట్లు జమ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం 55 లక్షల మందికి రైతులకు రూ.20 వేల చొప్పున సుమారు రూ.11 వేల కోట్లు అన్నదాత సుఖీభవ పథకం కింద జమ చేయాల్సి ఉంది. ఇందులో పీఎం కిసాన్ కింద కేవలం 48 లక్షల మంది రైతులకు.. ఒక్కొక్క కుటుంబానికి రూ.6 వేలు మాత్రమే జమ చేస్తున్నారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఖాళీ ఖజానాను అప్పగించడంతో కూటమి ప్రభుత్వానికి నిధులు సమీకరణ సవాలుగా మారింది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల కోసం వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతున్నాయి. దీనికి తోడు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాల్సి రావడం.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలతో పాటు.. ఇతర ఖర్చులకు నిధులు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌తో నెట్టుకువస్తున్న ప్రభుత్వం.. పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. సూపర్ సిక్స్‌లోని పథకాలకు కొత్త బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సూపర్‌సిక్స్‌లోని తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలను వెంటనే అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది.