పదేళ్లు ఏకఛత్రాధిపతిగా వెలుగు వెలిగిన బీఆర్ఎస్‌కు ఇప్పుడు కాలం అస్సలు కలిసి రావడం లేదు. నా మాటే శాసనం అన్నట్లుగా పదేళ్ల పాటు పాలన సాగింది. అయితే ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా మార్చారో… అప్పటి నుంచి అన్ని కష్టాలే. ఇక ఎన్నికల ఓడిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిపోయింది. మనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేసిన నేతలంతా ఓడిపోయారు. హ్యాట్రిక్ కొడుతున్నామని గొప్పగా చెప్పుకున్న కేటీఆర్‌కు షాక్ తగిలింది. దానికి తోడు ఏడాది కాలంగా పార్టీ అధినేత బయటికి వచ్చిన సందర్భాలే లేవు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసినప్పటికీ కనీసం ఒక్కచోట కూడా గెలవలేదు. పైగా డిపాజిట్లు రాలేదనే అపవాదు మూటగట్టుకుంది.
ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రతిసారి బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తొలి రోజుల్లో సూపర్ సిక్స్ అమలు ఎప్పుడూ అని ప్రశ్నించారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేయడంతో కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. ఇక ఆ తర్వాత రైతు రుణమాఫీ అంశంపై సవాళ్లు చేశారు. ఆగస్టు 15 నాటికి హామీ ఇచ్చినట్లుగా రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అయితే చెప్పినట్లుగానే రూ.1.50 లక్షల లోపు ఉన్న రుణాలను తెలంగాణ సర్కార్ మాఫీ చేసింది. దీంతో… రూ.2 లక్షల రుణం మాఫీ చేయలేదు కదా అంటూ ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు.
Also Read : ఏపీలో లోకేష్ రెడ్ బుక్ ఇన్ యాక్షన్
ఇక ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రాను తెరపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్. దీంతో హైడ్రా అక్రమం అంటూ తెగ గోల పెట్టారు. చివరికి హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే హైకోర్టులో పిటిషన్ దారులకు చుక్కెదురైంది. హైడ్రా వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని… దానిని కొనసాగించవచ్చంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో హైడ్రా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళన అంశంపై వివాదం చెలరేగింది. దీంతో మరో అంశం దొరికింది అంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాలు, ఆందోళనకు పిలుపునిచ్చారు. దీనికి చెక్ పెట్టేలా ఆక్రమణ దారులకు రేవంత్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించింది. అలాగే మూసీ ప్రక్షాళనకు కేంద్ర పెద్దలు కూడా లోపాయికారిగా మద్దతు తెలపడంతో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు.
ఇక తాజాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. పరీక్ష వాయిదా వేయాలని… జీవో రద్దు చేయాలంటూ కొంతమంది నిరుద్యోగులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. అలాగే హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇక సరిగ్గా పరీక్ష రోజు సుప్రీం కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని… పరీక్షల నిర్వహణపై స్టే వస్తుందని గంపెడంత ఆశ పెట్టుకున్నారు గులాబీ పార్టీ నేతలు. అయితే సుప్రీం కోర్టు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. స్టే ఇచ్చేది లేదని తేల్చేసింది. దీంతో పరీక్షలు ప్రారంభమయ్యాయి కూడా.
ఎన్నికల హామీల అమలుతో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధి, మూసీ ప్రక్షాళన, హైడ్రా, గ్రూప్ -1, రైతు రుణ మాఫీ… ఇలా ఏ అంశం తీసుకున్నా సరే… బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో గులాబీ పార్టీ నేతలు ఏం చేయాలో కూడా అర్థం కాని స్ధితిలో ఉన్నారు.