ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ పదవి ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఓ వైపు మూసి ప్రక్షాళన వేగవంతం కాగా, మరో వైపు హైడ్రా కూల్చివేతలు కూడా దూకుడుగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో జీహెచ్ఎంసి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనేది కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితిలో న్యాయస్థానాల జోక్యం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ కమీషనర్ సమర్ధ అధికారి ఉండాల్సిన అవసరం ఉంది.
అవసరమైతే విమర్శలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అమ్రాపాలి ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉండటంతో తెలంగాణా ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. బల్దియాలో ఉన్న సవాళ్ళు అర్థం చేసుకొని ఫేస్ చేసే సమర్ధ అధికారి అవసరం ఉన్న నేపధ్యంలో… రేవంత్ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారులు, అలాగే ప్రస్తుత సిఎస్ తో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అత్యంత కీలకంగా మారింది.
Also Read : స్కిల్ కేసులో బాబుకు క్లీన్ చిట్, హడావుడి ఎక్కడ…?
దీనితో సీనియర్ ఐఏఎస్ ను కొన్నిరోజుల పాటు ఇన్చార్జి గ్రేటర్ కమీషనర్ గా నియమించే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపుగా సిఎస్ శాంత కుమారి ఆ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. పరిశీలనలో ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, HMDA కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డిల్లీ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ పేర్లను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎంఏయుడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కి కొన్నిరోజుల పాటు ఇన్చార్జి కమీషనర్ గా బాధ్యతలు ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారులు సూచించినట్టు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.