దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. పొలిటికల్ కెరీర్ లో ఇప్పటికే మూడు పార్టీలు మారిన దువ్వాడ… నిజ జీవితంలో కూడా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడి మీడియాలో నిలిచిన దువ్వాడ… ఓడిన తర్వాత కూడా కుటుంబ తగాదాలతో వార్తల్లోకెక్కాడు. ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు పై బూతులతో రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ… తాను ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.
భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు దువ్వాడ. ఈ విషయం తెలుసుకున్న వాడు భార్య వాణి ఆయన ఇంటి ముందే ఇద్దరు ఆడపిల్లలతో సహా ధర్నా చేపట్టారు. తమని దువ్వాడ మోసం చేసాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఇదే సమయంలో ఆ ఇల్లు తనదే అంటూ దివ్వెల మాధురి దాడికి యత్నించటం.. దువ్వాడ శ్రీనివాస్ తో తనకు సంబంధం ఉందంటూ బహిరంగంగానే ఒప్పుకోవటం పెద్ద దుమారమే రేపింది. వివాదం చెలరేగిన తొలి రోజుల్లో తమ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ బుకాయించిన దువ్వాడ.. ఆ తర్వాత మాత్రం ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.
Read Also : సాయన్న సాయం ఏది…? ఢిల్లీ ఎందుకు పోవట్లేదు రెడ్డి గారూ…
చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఒకేసారి బయట కనిపించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. త్వరలోనే తమ వివాహం అంటూ మాధురి ప్రకటించారు కూడా. అంతటితో ఆగకుండా… తిరుమల శ్రీవారి ప్రధాన గోపురం ముందు ప్రాంతంలో, పుష్కరిణిలో ఫోటో షూట్ చేశారు దివ్వెల మాధురి. ఇదంతా ఫ్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం పెడుతుంది. మాధురి ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే… శ్రీనివాస్ పక్కనే నిలబడి డైరెక్షన్ ఇచ్చారు. శాసన మండల సభ్యునిగా హుందాగా వ్యవహరించవలసిన దువ్వాడ శ్రీనివాస్… ఇలా తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం పై స్వామి వారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి పై చర్యలు తీసుకోవాలని, ఈ ఫోటో షూట్ కు అనమతిచ్చిన టీటీడీ ఉద్యోగులను వెంటనే తొలగించాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.