ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుస అక్రమాలు దేవస్థానం ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా లడ్డూ ప్రసాదాల విక్రయాల్లో కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది. భక్తుల వద్ద పూర్తి స్థాయిలో డబ్బులు వసూలు చేసి, లెక్క ప్రకారం ఇవ్వాల్సిన లడ్డూల కంటే తక్కువగా ఇస్తూ మోసానికి పాల్పడుతున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్‌కు ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక విచారణలో ఈ మోసం నిజమేనని తేలడంతో, సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు,
Also Read : ఎన్డీఏకు జగన్ అండ.. కానీ ఒక కండీషన్..!
పర్యవేక్షణ లోపంపై సూపర్‌వైజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. గత కొంతకాలంగా దుర్గగుడిలో ఇలాంటి వివాదాలు తరచూ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా వారం రోజుల క్రితమే దర్శన టికెట్ కౌంటర్‌లో ప్రింటర్ సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని అదనపు టికెట్లు అమ్ముతూ రూ. 18,600 నగదుతో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పట్టుబడ్డాడు. అంతకుముందు హుండీ లెక్కింపులో అసలు బంగారం స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టే ప్రయత్నం జరగడం,
Also Read : కేంద్రానికి షాక్ ఇచ్చిన డీఎంకే.. చంద్రబాబు రాయబారం ఫలిస్తుందా..?
దసరా ఉత్సవాల్లో నిర్వహణ లోపాలు తలెత్తడం వంటి ఘటనలు ఆలయ పర్యవేక్షణలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. ఆలయంలోని కీలకమైన టికెట్, ప్రసాద కౌంటర్ల వద్ద అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించడం, వారిపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ కొరవడటమే ఈ అక్రమాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం సస్పెన్షన్లతో సరిపెట్టకుండా బాధ్యులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, కీలక విభాగాల్లో నిజాయితీ గల రెగ్యులర్ సిబ్బందిని నియమిస్తేనే ఇంద్రకీలాద్రిపై ఇలాంటి ఇంటిదొంగల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.


