భారత ఆటోమొబైల్ మార్కెట్లో భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ మహీంద్రా సంస్థ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఏడు సీట్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్, భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ కీలక భద్రతా రేటింగ్ ఎక్స్ఈవీ 9ఎస్ లైనప్‌లోని అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేయడంతో పాటు, క్రాష్ టెస్ట్‌లలో పెద్దల రక్షణ విభాగంలో 32 పాయింట్లకు గానూ 31.15 పాయింట్లు, పిల్లల రక్షణ విభాగంలో 49 పాయింట్లకు గానూ 45 పాయింట్లు సాధించి కుటుంబ ప్రయాణాలకు అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది.
Also Read : ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన ధోని, సీఎస్కేలో కొత్త ఇన్నింగ్స్..!
ప్రయాణికుల ప్రాణాలకు పూర్తి భరోసా కల్పించేలా ఫ్రంటల్ ఆఫ్‌సెట్ మరియు సైడ్-ఇంపాక్ట్ క్రాష్ టెస్ట్‌లలో డ్రైవర్‌తో పాటు కో-డ్రైవర్ తల, మెడ, ఛాతి, కాళ్ల భాగాలకు అత్యుత్తమ రక్షణ లభించినట్లు పరీక్షల్లో నిరూపితమైంది. ఇందుకోసం మహీంద్రా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ వ్యూ, టైర్-ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంట్స్ వంటి అత్యాధునిక వ్యవస్థలను పొందుపరిచింది. వీటికి అదనంగా హైఎండ్ వేరియంట్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఫార్వర్డ్-కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫీచర్లను కూడా అందిస్తోంది.
Also Read : రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ గుడ్‌బై..?
ఇక బ్యాటరీ మరియు పనితీరు విషయానికొస్తే, ఎక్స్ఈవీ 9ఎస్ మోడల్‌ను 59kWh, 70kWh, 79kWh అనే మూడు బ్యాటరీ ఆప్షన్లతో మహీంద్రా అందుబాటులోకి తెచ్చింది. వేరియంట్లను బట్టి ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 521 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 679 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇన్ని అద్భుతమైన భద్రతా ప్రమాణాలు, శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 20.65 లక్షలుగా నిర్ణయించగా, ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూనే ప్రయాణికుల భద్రతలో తాము మేటి అని మహీంద్రా ఈ 5-స్టార్ రేటింగ్‌తో మరోసారి నిరూపించుకుంది.


