భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్ సుదీర్ఘ ప్రయాణంలో ఒక అద్భుతమైన, సువర్ణ అధ్యాయానికి తెరపడింది. ప్రతి ఏటా ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ అభిమానులందరినీ వేధిస్తున్న ఆ అతిపెద్ద ప్రశ్నకు ఎట్టకేలకు అధికారికంగా సమాధానం లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆత్మగా, ఆ జట్టు అభిమానుల ఆరాధ్య దైవంగా వెలుగొందిన టీం ఇండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ నుంచి ధోని రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెన్నై యాజమాన్యం అధికారికంగా ధృవీకరించడంతో యావత్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది.
Also Read : ఇరాన్ వార్నింగ్ లైట్ తీసుకున్న అమెరికా.. చివరకు ఏమైంది..?
2008లో ఐపీఎల్ ఆరంభమైన నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ధోనిది విడదీయరాని అనుబంధం. తలా అంటూ చెన్నై అభిమానులు గుండెల్లో పెట్టుకుని పూజించే ధోని, క్రీజులోకి అడుగుపెడితే స్టేడియాలు హోరెత్తిపోయేవి. ఆటగాడిగా, కెప్టెన్‌గా సీఎస్కే జట్టును ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలపడంలో ధోని పోషించిన పాత్ర అద్వితీయం. ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉన్నా సరే, మొహంలో ఏమాత్రం ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విజయతీరాలకు చేర్చిన తీరు ధోనికి కెప్టెన్ కూల్ అనే బిరుదును సార్థకం చేసింది.
Also Read : విజయ డెయిరీలో ఏం జరుగుతుంది.. ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు..?
ఆటగాడిగా మైదానానికి దూరమవుతున్నప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ శిబిరాన్ని మాత్రం ధోని వీడటం లేదు. జట్టుతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ, ఇకపై సీఎస్కే మెంటార్‌గా ధోని కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం స్పష్టం చేసింది. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రాకపోయినా, డగౌట్లో ఉండి యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూ, వ్యూహరచనలో కీలక పాత్ర పోషించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా కేవలం అభిమానుల కోసమే ఐపీఎల్లో కొనసాగుతూ వచ్చిన ధోని, ఇప్పుడు సరైన సమయంలో యువతరానికి బాటలు వేస్తూ పక్కకు తప్పుకున్నాడు. ఎల్లో జెర్సీలో నంబర్ 7 ఆటగాడిగా ధోని సృష్టించిన రికార్డులు, అందించిన మధుర జ్ఞాపకాలు ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోనివి.


