ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు దగ్గరపడుతున్న వేళ టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడనున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జైస్వాల్‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలు రాజస్థాన్ యాజమాన్యాన్ని సంప్రదించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భయంకర నిజాలు..!
రాజస్థాన్ రాయల్స్ జట్టులో జైస్వాల్ సంతోషంగా లేడని, అతడు కెప్టెన్సీ బాధ్యతలు ఆశిస్తున్నాడని తాను విన్నట్లు ఇర్ఫాన్ పేర్కొన్నాడు. గత సీజన్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడం, రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ అప్పగించడం వంటి పరిణామాలతో జైస్వాల్ అసంతృప్తిగా ఉన్నాడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా గత సీజన్‌లో సూర్యవంశీ కంటే జైస్వాల్ తక్కువ పరుగులు చేయడం కూడా అతడి ఆలోచనపై ప్రభావం చూపి ఉండవచ్చని అన్నాడు.
Also Read : మళ్ళీ మొదటికి వచ్చిన విజయా డైరీ కథ.. అసలేం జరిగింది..?
జైస్వాల్ కనుక కెప్టెన్సీ కోరుకుంటే, అతడికి లక్నో లేదా కోల్‌కతా జట్లు సరైన వేదికలని ఇర్ఫాన్ విశ్లేషించాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2027 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఒక సమర్థవంతమైన భవిష్యత్ కెప్టెన్ అవసరమని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. ఇందులో భాగంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, బదులుగా యశస్వి జైస్వాల్‌ను కోల్‌కతా జట్టులోకి తీసుకుంటే ఇరు జట్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సూచించాడు. వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ బౌలర్‌ను వదులుకోవడం కోల్‌కతాకు కొంత కష్టమే అయినా, జైస్వాల్ రూపంలో జట్టుకు దీర్ఘకాలిక నాయకుడు దొరుకుతాడని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.


