జూనియర్ ఎన్టీఆర్ మామ గారు చంద్రబాబుపై కయ్యానికి కాలు దువుతున్నారా..? 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు.. అప్పుడు రాజకీయంగా విమర్శలు, ఆరోపణలు చేశారు. బంధుత్వం వల్ల ఆ ఆరోపణలు, విమర్శలను చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే ఇప్పుడు ఆయనకు కొమ్ములొచ్చాయేమో అంటున్నారు రాజకీయ విమర్శకులు. తాజాగా చంద్రబాబుపైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి నార్నె శ్రీనివాస్ స్వయానా చంద్రబాబు మేనకోడలు భర్త. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ మామగారు కూడా. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కమ్మ సామాజిక వర్గం కావడంతో.. జగన్ మోహన్ రెడ్డి సీటు ఇవ్వలేదు అనే మాట అప్పట్లో వైసీపీ నేతలే వ్యాఖ్యానించారు.
Also Read : బయట అర్నాబ్ బీభత్సం.. లోపల జగన్ ఆస్తుల లెక్కలు..!
2024 ఎన్నికల్లోనే చంద్రబాబు పైన నార్నె విమర్శలు, ఆరోపణలు చేశారు. అయితే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఆపలేకపోయారు. ఎన్నికల తర్వాత రెండేళ్లు మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. అసలు ఇప్పటి వరకు నార్నె ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు.. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారనే ప్రశ్నలకు.. ఆయన వెనుక వైసీపీ నేతలున్నారనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు చెల్లెలుకు తిరుపతిలో ప్రమాదం జరిగిందని.. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి వైద్యం చేయిస్తున్నట్లు నార్నె తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాలేదని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన చెల్లెలును చూసేందుకు ఇంత వరకు చంద్రబాబు సహా కుటుంబ సభ్యులెవరు రాలేదని ఆరోపించారు.
కుటుంబానికి సంబంధించిన విషయాలపై సోషల్ మీడియా ద్వారా చంద్రబాబుపై విషం కక్కట్టం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి నార్నె శ్రీనివాస్‌కు తన సొంత మేనకోడలుతో చంద్రబాబు స్వయంగా వివాహం జరిపించారు. అంతే కాదు.. నార్నె శ్రీనివాస్ కుమార్తె వివాహం జూనియర్ ఎన్టీఆర్‌తో జరగడానికి కూడా కారణం చంద్రబాబు మాత్రమే. చంద్రబాబు బంధువనే ఒకే ఒక కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి నాడు నందమూరి హరికృష్ణ ఒప్పుకున్నారు. నార్నె ఎస్టేట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, న్యూస్ ఛానల్ ప్రారంభానికి కూడా చంద్రబాబు సహకరించారు. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా వ్యవహరించారు కూడా.
కానీ.. ఇప్పుడు వారిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియటం లేదు. నిజానికి 1999 ఎన్నికల్లోనే చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ నార్నె ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం నో చెప్పారు. చివరికి చంద్రబాబు చెల్లెలు, మేనకోడలితో కూడా రికమండేషన్ చేయించారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిరాకరించారు. ఆ తర్వాత రాజకీయాల ఊసే ఎత్తలేదు. 1999లో టీడీపీ గెలిచిన తర్వాత నార్నె వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. అందుకే జూనియర్‌కు నార్నె కుమార్తె వివాహం జరిగేందుకు చంద్రబాబు మధ్యవర్తిత్వం వహించారు అనేది కుటుంబ సభ్యుల మాట. అంత సాయం చేసిన చంద్రబాబు గురించి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read : కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు సీరియస్..!
కుటుంబ సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగను సొంత ఊర్లో కుటుంబ సభ్యుల మధ్యనే చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు ఆరోగ్యం బాలేదని.. మీడియా ద్వారా చెప్పడం ఏమిటో.. దీని వెనుక కారణాలేమిటనేది అందరికీ తెలిసిపోతోంది. ఓ వైపు బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో షర్మిల కుమార్తె వివాహానికి జగన్ అనుమతి ఇవ్వలేదని అందరూ తిట్టిపోస్తున్నారు. ఇలాంటి సమయంలో కేవలం టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే నార్నె శ్రీనివాస్‌ను తెర పైకి తీసుకువచ్చి ఇలా చంద్రబాబు చెల్లెలు ఆరోగ్యం.. అంటూ వైసీపీ నేతలే తెర వెనుక ఉండి నార్నెతో ఇలా చెప్పిస్తున్నారని తెలిసిపోతుంది. ఇదంతా ఓ పథకం ప్రకారం జరుగుతుందని విమర్శలు చేస్తున్నారు.


