ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1వ తేదీన జరగబోయే పట్టణ, మున్సిపల్ ఎన్నికల వేళ లబ్ధిదారులకు అందే పెన్షన్లను అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ మరోసారి తెరవెనుక కుట్రలకు తెరలేపింది. ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తరుణంలో.. దీనిని ఎలాగైనా ఆపాలని లేదా జాప్యం జరిగేలా చేయాలని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైసీపీ ఒక ఫిర్యాదు లేఖను పంపింది.
Also Read : కరువు ముప్పు.. కదిలిన రేవంత్ సర్కార్..!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల పంపిణీ పేరుతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ వైసీపీ తన లేఖలో వింత వాదనను తెరపైకి తెచ్చింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మాత్రమే పింఛన్ల పంపిణీ జరగాలని, కూటమి ప్రభుత్వ ప్రతినిధులు లేదా వాలంటీర్లు ఇందులో పాల్గొనకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఎన్నికల అధికారులకు తక్షణమే కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
Also Read : కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు సీరియస్..!
మున్సిపల్ పోలింగ్ నవంబర్ 1న ఉన్నందున.. ఆ రోజు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ జరిగితే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయంతోనే వైసీపీ ఈ రకమైన అడ్డంకులు సృష్టిస్తోందని కూటమి నేతలు మండిపడుతున్నారు. దీనిపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సాకుతో పింఛన్ల పంపిణీ ప్రక్రియను వివాదాల్లోకి నెట్టాలని చూస్తోందని లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన తెల్లవారుజామునే లబ్ధిదారుల చేతుల్లో పెన్షన్ డబ్బులు పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంటే.. దానికి ఇలా లేఖల ద్వారా బ్రేకులు వేయాలని చూడటం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కూటమి నేతలు మండిపడుతున్నారు.


