ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు పరాభవాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం పాలై ఇప్పటికే సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా.. నేడు ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి టి20 మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ ఆరాటపడుతుండగా.. ఎలాగైనా భారత్ ను క్లీన్ స్వీప్ చేయాలని ఇంగ్లాండ్ కన్నేసింది. సౌతాంప్టన్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భారత జట్టు ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే.
Also Read : క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. భారత్ లో ‘బిగ్ బాష్ లీగ్’..!
ఫామ్ లో లేక ఓపెనర్ వైభవ్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో శివమ్ దూబే, తిలక్ వర్మ సైతం ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోతున్నారు. కీలక సమయాల్లో వికెట్లు పారేసుకుంటూ ప్రత్యర్థికి మ్యాచ్ ను చేతుల్లో పెడుతున్నారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ విభాగం కూడా ధారాళంగా పరుగులు సమర్పిస్తూ నిరాశపరుస్తోంది. వరుస ఓటముల నేపథ్యంలో నేటి మ్యాచ్ కోసం భారత తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read : అంతా ఓపెన్.. రావణ్‌కు జగన్ మద్దతు..!
గత కొన్ని మ్యాచ్‌లుగా బెంచ్ కే పరిమితమైన స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ ను ఈ మ్యాచ్ లో బరిలోకి దించే ఛాన్స్ ఉంది. వరుసగా విఫలమవుతున్న వైభవ్ లేదా ఇషాన్ కిషన్ లలో ఒకరిపై వేటు వేసి, వారి స్థానంలో శాంసన్ ను జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం. సౌతాంప్టన్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తుంది. బౌండరీలు చిన్నవిగా ఉండటంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు బోర్డుపై ఉంచాలని భావిస్తుంది. మరి ఈ చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా పుంజుకుని వైట్ వాష్ ప్రమాదం నుంచి తృటిలో తప్పుకుంటుందో.. లేక ఇంగ్లాండ్ చేతిలో పూర్తిగా లొంగిపోతుందో చూడాలి.

