సాధారణంగా మిడిల్ ఈస్ట్ లో యుద్ధం అనగానే.. మనకు గుర్తొచ్చేది పెట్రోల్, డీజిల్ ధరలు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు మండుతాయని అందరూ భావిస్తారు. కానీ, ప్రస్తుతం పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం మన ఊహకు అందని మరో కీలక రంగంపై గట్టి దెబ్బ కొట్టబోతోంది. అదే.. ఫార్మా రంగం. అవును, మీరు విన్నది నిజమే.. రాబోయే రోజుల్లో మీరు కొనే మందుల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read : అమరావతికి పట్టాభిషేకం.. పార్లమెంట్ లో అరుదైన ఘటన..!
మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ అంటారు. వీటితో పాటు బల్క్ డ్రగ్స్ సరఫరా కూడా ఇప్పుడు యుద్ధం వల్ల నిలిచిపోయింది. అంతర్జాతీయ రవాణా మార్గాల్లో.. ముఖ్యంగా ఎర్ర సముద్రం వంటి ప్రాంతాల్లో అస్థిరత నెలకొనడంతో, ఈ ముడి పదార్థాలు భారత్ కు చేరడం ఆలస్యమవుతోంది. సరఫరా తగ్గడంతో వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధం కారణంగా విమాన, నౌకాయాన సంస్థలు తమ రూట్లను మార్చుకోవాల్సి వస్తోంది.
Also Read : బ్రేకింగ్; పేర్ని నానికి షాక్ ఇచ్చిన పోలీసులు..!
దీనివల్ల ఇంధన ఖర్చుతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరిగాయి. ఈ అదనపు భారం అంతా ముడి పదార్థాల ధరలపై పడి, చివరకు అది మందుల తయారీ వ్యయాన్ని పెంచుతోంది. ప్రస్తుతం మందుల షాపుల్లో అందుబాటులో ఉన్న స్టాక్ అంతా యుద్ధం మొదలవ్వకముందు తయారైనది. కాబట్టి, ప్రస్తుతానికి పాత ధరలే కొనసాగుతున్నాయి. కానీ, ఇప్పుడు కొత్తగా తయారవుతున్న బ్యాచ్ లకు పెరిగిన ముడి పదార్థాల ధరలు వర్తిస్తాయి. దీనివల్ల త్వరలోనే మార్కెట్లోకి వచ్చే కొత్త మందుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. బిపి, షుగర్, గుండె సంబంధిత వ్యాధులతో నిత్యం మందులు వాడే వారికి ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే.

