ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు కార్యకర్తలను, అధిష్టానాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత ఎన్నికల సందర్భంగా తాను విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చానని.. వాట్సాప్ లో కొలికపూడి స్టేటస్ పెట్టారు. ఇక అక్కడి నుంచి మరిన్ని సంచలన ఆరోపణలు చేసారు. అటు కేసినేని చిన్నీ కూడా ఈ వ్యవహారంపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు.
Also Read : కొలికపూడి వర్సెస్ కేసినేని.. అధిష్టానం సీరియస్.. మంగళగిరిలోనే పంచాయితీ..!
ఇక నిన్న కొలికపూడి ఓ ప్రముఖ ఛానల్ డిబేట్ లో కూర్చుని చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. కేసినేని చిన్నీ సన్నిహితుల్లో వైసీపీ, బీఆర్ఎస్ నేతలే ఎక్కువ అంటూ ఆయన విమర్శించారు. తెలంగాణా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. చిన్నీకి ఎన్నికల్లో ఆర్ధిక సహాయం చేసారని ఆరోపించారు. అలాగే గంజాయి, ఇసుక అక్రమ రవాణా నియోజకవర్గంలో జరుగుతోందని మాట్లాడారు. చిన్నీ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కాపాడుతున్నారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా కొరకు.. జిల్లాకో మనిషిని నియమించుకున్నారు అని ఆరోపించారు.
అందులో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో ఉండే పెద్దిరెడ్డి రామచంద్ర రావు అనే వ్యక్తి.. మొన్న మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ లను కొనేందుకు డబ్బులు ఇచ్చారు అంటూ వ్యాఖ్యలు చేసారు. దీనితో ఒక్కసారిగా టీడీపీ వర్గాలు కంగుతిన్నాయి. అయితే కొలికపూడి మరో వ్యూహంతో ఈ ఆరోపణలు చేస్తున్నారు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోన్న ఆయన.. సస్పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : వెజ్ లో మంచి ప్రోటీన్ దొరికే ఆహారం ఇదే..!
ఇప్పటికే కొలికపూడి విషయంలో పార్టీ అధిష్టానం ఓపికగా వ్యవహరించింది అనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తలను, స్థానిక నాయకులను అవమానించినా భరించారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అయినా సరే కొలికపూడి డిబేట్ లో పాల్గొని వ్యాఖ్యలు చేసారు. దీనితో ఆయనపై పార్టీ అధిష్టానం చర్యలు ఖాయం అంటున్నాయి పార్టీ వర్గాలు.




