తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మేడారం టెండర్ల పంచాయతీ పెద్ద దుమారం రేపింది. సుమారు రూ.70 కోట్ల విలువైన పనుల టెండర్ల విషయంలో పొంగులేటి తనను కనీసం సంప్రదించలేదని కొండా సురేఖ ఆరోపించారు. ఆ వివాదం అలా కొనసాగుతున్న సమయంలోనే కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ను విధుల నుంచి తప్పిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత సిమెంట్ సంస్థల యాజమాన్యాలను బెదిరించారనే ఆరోపణలతో సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సురేఖ కుమార్తె పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నేరుగా విమర్శలు చేశారు. బీసీ మహిళా మంత్రిపై రెడ్డి సామాజిక వర్గం కక్ష కట్టిందంటూ ఆరోపణలు చేశారు.
Also Read : వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఆ కాంటాక్ట్స్ బ్లాక్..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు వ్యతిరేకంగా కొందరు పనిగట్టుకుని మరీ రాజకీయాలు చేస్తున్నారని కొండా సురేఖ స్వయంగా ఆరోపించారు. కడియం శ్రీహరి పెత్తనం చేస్తున్నారన్నారు. దీనికి కొందరు కాంగ్రెస్ పెద్దలు సపోర్ట్ చేస్తున్నారని కొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా ఆరోపణలను కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఏ విషయం అయినా సరే.. ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఓఎస్‌డీ సుమంత్ అరెస్టు డ్రామా తర్వాత తమ పదవికి కొండా సురేఖ రాజీనామా చేస్తారనే పుకార్లు షికారు చేశాయి. అదే సమయంలో మంత్రివర్గ సమావేశానికి సురేఖ దూరంగా ఉన్నారు. దీంతో మంత్రివర్గం నుంచి సురేఖ తొలగింపు ఖాయమనే మాట బాగా వినిపించింది.
Also Read : కందుకూరులో వైసీపీ ప్లాన్ బెడిసికొట్టిందా..?
కొండా సురేఖతో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. తొందరపాటు చర్యలు వద్దని వారించారు. అలాగే పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు చేయవద్దని హితవు పలికారు. ఈ భేటీలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా కొండా దంపతులతో విడిగా చర్చించారు. అసలు సమస్య మూలాలు తెలుసుకున్నారు. దీనిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. పార్టీలో తనకు ఎదురవుతున్న సమస్యలపై కొండా దంపతులు సీఎంకు నేరుగా వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తన కుమార్తె రేవంత్ రెడ్డిపైన చేసిన విమర్శలపై కూడా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొండా దంపతులపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతుల తుఫాన్‌కు కాస్త బ్రేక్ పడినట్లు అయ్యింది.