బీహార్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా, ఎన్డియే కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ రాబోయే 2 రోజుల్లో ఎన్డియే సీట్ల పంపకంపై ప్రకటన చేసే అవకాశం కనపడుతోంది. అక్టోబర్ 12న సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బిజెపి తన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ కీలకమైన సమావేశంలో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు, వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
Also Read : కేసీఆర్‌కు మాజీ మంత్రి షాక్..!
చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)తో ఎలాంటి విభేదాలు లేవని, రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ జైస్వాల్ తెలిపారు. ఎన్డియేకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం లోక్ జనశక్తి పార్టీ.. తమ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ చేతిలో పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read : హెచ్ 1 బీలో మరో షాక్ కు ట్రంప్ రెడీ..?
అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసేందుకు గానూ, బిజెపి బీహార్ కోర్ గ్రూప్ అక్టోబర్ 11న ఢిల్లీలో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశాల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 13న అభ్యర్ధుల తుది జాబితా విడుదల కానుంది. చిరాగ్ పాశ్వాన్ 243 స్థానాల్లో కనీసం 36 డిమాండ్ చేస్తున్నారు. కానీ బిజెపి మాత్రం 22 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. అదేవిధంగా, హిందుస్తానీ అవామ్ మోర్చా కూడా 15 స్థానాలను డిమాండ్ చేస్తోంది. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6 మరియు నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.