“నాన్న.. బీ కేర్ ఫుల్.. ఏదో ఒకరోజు కొంప ముంచుతాడు..” తండ్రి కేసీఆర్‌కు గారాల కూతురు కల్వకుంట్ల కవిత హెచ్చరిక చేశారు. అయితే ఈ హెచ్చరికను తన బావ, మాజీ మంత్రి హరీష్ రావు గురించి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. మరీ ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు మనుగడ కోసం ప్రయత్నం చేస్తోంది. హ్యాట్రిక్ గెలుపు ఖాయమనుకున్న సమయంలో పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది.
Also Read : కేసీఆర్‌కు మాజీ మంత్రి షాక్..!
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది. కారు పార్టీలో ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం పార్టీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. అయితే అది ప్రస్తుతం చాప కింద నీరులా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే సమయంలో బీఆర్ఎస్‌లో కవిత రూపంలో పెద్ద దుమారం చెలరేగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన కేసీఆర్ కుమార్తె కవిత 5 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలైంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని లేఖ రాశారు కవిత. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వెనుక హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారని కవిత ఆరోపించారు. దీంతో కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత నుంతి కవిత తెలంగాణ జాగృతి బలపేతంపై దృష్టి పెట్టారు.
Also Read : కెప్టెన్ పదవి పై సమాచారం ఉంది.. గిల్ కామెంట్స్..!
తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న కవిత.. బీఆర్ఎస్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు త్వరలోనే హరీష్ రావు వెన్నుపోటు పొడవటం ఖాయమన్నారు. పార్టీని సొంతం చేసుకునేందుకు హరీష్ రావు కుట్రలు చేస్తున్నారన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నాటి నుంచి తాను ఇప్పటి వరకు తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడలేదన్నారు. రాజకీయాల్లో రక్త సంబంధాలకు చోటు లేదన్న కవిత.. తన అన్న కేటీఆర్ కూడా రాజకీయాలు చేస్తున్నారు కదా.. అని వ్యాఖ్యానించారు. దీంతో కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.