ఏ ప్రాంతానికైనా గుర్తింపు రావాలంటే.. ముందుగా దృష్టి పెట్టాల్సింది పర్యాటక రంగంపైనే. ఈ విషయంలో 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే చంద్రబాబు వెల్లడించారు. టూరిజం రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించారు. పర్యాటకులు ఏపీ వైపు చూసేలా ప్లాన్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. టూరిజం వల్లే డబ్బులు వస్తాయని 20 ఏళ్ల తర్వాత సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో వ్యాఖ్యానించారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read : పదవులు లీడర్‌కు.. దెబ్బలు క్యాడర్‌కు..!
టూరిజం రంగం అభివృద్ధి చెందితే పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అందుకే గోవా, కేరళ, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ వంటి రాష్ట్రాలు పర్యాటకం అభివృద్ధి పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. ఆ రంగంలోనే ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి కూడా. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖను టూరిజం డెస్టినేషన్‌గా చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
ఏపీకి అందుబాటులో ఉన్న సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని అటు పర్యాటకంగా, ఇటు వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొత్త పోర్టుల నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది. ఇదే సమయంలో బీచ్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది జూన్ నెలలోనే మచిలీపట్నం బీచ్‌లో మసూలా బీచ్ ఫెస్ట్‌ను 3 రోజుల పాటు గ్రాండ్‌గా నిర్వహించారు. ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో మెగా ఈవెంట్ నిర్వహణకు సిద్ధమైంది.
Also Read : జెన్ జీతో రాహుల్ పక్కా ప్లాన్.. బీజేపీ ఎదుర్కొంటుందా..?
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో బాపట్ల జిల్లా సూర్యలంకలో మెగా బీచ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో విద్యార్థులను కూడా భాగస్వామ్యులను చేశారు. యువత ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఓ వైపు దసరా సెలవులు కూడా కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
సూర్యలంక బీచ్ ఫెస్ట్‌ను పూర్తిగా యువతను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోటింగ్, సీ ఫుడ్ ఫెస్ట్, సెలబ్రెటీ ఈవెంట్స్‌తో పాటు తాటికల్లు ప్రమోషన్ చేస్తున్నారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఓ వైపు విజయవాడ ఉత్సవ్.. మరో వైపు సూర్యలంక బీచ్ ఫెస్ట్‌తో ఈ ఏడాది దసరా పండుగ ఏపీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు వస్తుందని భావిస్తున్నారు.