ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు, అనుకూల మీడియా పదే పదే విష ప్రచారం చేస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. సరిగ్గా వారం క్రితం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలోనే సుమరు 30 సెంటీమీటర్లు పైగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండవీటి వాగుకు భారీగా వరద నీరు చేరింది. చివరికి కాజా టోల్ గేట్ సమీపంలో జాతీయ రహదారిపై 2 అడుగుల మేర నీరు చేరింది.
Also Read : ఉపరాష్ట్రపతి ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కష్టాలు
భారీ వర్షాలకు అమరావతిలో పలు చోట్ల పొలాలు నీట మునిగాయి. అలాగే పునాదుల దశలో ఉన్న ఐకానిక్ టవర్ల ప్రాంతంలోకి వరద నీరు చేరుకుంది. దీంతో కొంతమంది వైసీపీ అభిమానులు ఆ ప్రాంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమరావతి కలల రాజధాని కాదు.. అలల రాజధాని అని.. ఇది అమరావతి కాదు.. భ్రమరావతి అని.. ఆంధ్ర వెన్నిస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. త్వరలో అమరావతిలో పులస చేపలు కూడా దొరుకుతాయంటూ సెటైర్లు వేశారు. ఇలా ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మించడం సరి కాదనే.. జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ఎంపిక చేశారని కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి అమరావతి మునిగిపోతోందని.. చంద్రబాబు చేస్తున్న అప్పులు కేవలం నీళ్లు ఎత్తిపోయడానికే సరిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.
వైసీపీ నేతల దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవాలు తెలియకుండా ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అలాగే టీడీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే అధినేత ఆదేశాలను కూడా పార్టీ నేతలు, మంత్రులు సైతం లెక్క చేయడం లేదు.
Also Read : వివేకా కేసులో సుప్రీం సంచలన నిర్ణయం..!
వాస్తవానికి అమరావతిలో కేవలం ఐకానిక్ టవర్ల కోసం ఏర్పాటు చేసిన పునాదుల ప్రాంతం మాత్రమే నీట మునిగింది. ఇందుకు ప్రధాన కారణం.. ఇక్కడ పునాదుల కోసం చాలా లోతుగా తవ్వారు. భూమి అడుగు నుంచి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. ఇప్పటికే 30 అడుగుల పిల్లర్లు నిర్మించారు. ఆ పిర్లర్లు ఏర్పాటు చేసిన ప్రాంతానికే నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు వైసీపీ నేతలు. కానీ సీఆర్‌డీఏ రాయపూడిలో కొత్తగా నిర్మించిన భవనం కానీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్లు కానీ, ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న ఏపీ సచివాలయం, హైకోర్టు భవనాల్లోకి ఎలాంటి నీరు చేరలేదు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు సూచనల మేరకు ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పర్యటించటం లేదు. అక్కడికి మీడియాను తీసుకెళ్లి.. ఇక్కడ అంతా బాగుంది అనే మాట ఇప్పటి వరకు చెప్పలేదు. కనీసం సంబంధిత శాఖ మంత్రి నారాయణ కూడా ఇప్పటి వరకు అక్కడ వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు. ముంపు ప్రాంతం కాదు అని సీఆర్‌డీఏ, టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది తప్ప.. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలా చేస్తే.. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనేది అమరావతి ప్రాంత రైతుల మాట. కానీ మంత్రులు మాత్రం.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు.