అమరావతి కాదు.. ఇది భ్రమరావతి.. ఇక్కడ రాజధాని నిర్మాణం ఏ మాత్రం అనుకూలం కాదు.. చిన్నపాటి వర్షానికే అంతా మునిగిపోతుంది. ఇది కలల రాజధాని కాదు.. అలల రాజధాని.. అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఇంకా చెప్పాలంటే వైసీపీ అనుకూల మీడియాలో ఈ రోజంతా అమరావతి మునిగిపోయిందనే ప్రచారమే జరుగుతోంది. ఇందుకు మరో కారణం కూడా.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ విషయం ఏమార్చడానికి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అమరావతి గురించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది.
Also Read : ఈ ప్రజాస్వామ్యవాదులు అప్పుడు ఎక్కడ..?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో జాతీయ రహదారులు సహా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాజా టోల్ గేట్ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇదే సమయంలో ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అదే సమయంలో అమరావతిలోని కొండవీటి వాగు కూడా వరద నీటితో పొంగిపొర్లుతోంది. దీని కారణంగా అమరావతిలోని పలు ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి. ఇదే విషయాన్ని వైసీపీ తన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.
అయితే దీనిపై ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇస్తోంది. నిజంగానే అమరావతి మునిగిందా అనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. అసలు అమరావతిలో మునిగిన ప్రాంతం ఏమిటో తెలుసా అంటూ తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో ప్రస్తుతం ఐకానిక్ టవర్లు ఉన్న ప్రాంతంలో మాత్రమే నీళ్లు వచ్చాయి. అంతే తప్ప.. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఏపీ సీఆర్‌డీఏ భవనం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ పరిధిలో ఎలాంటి నీరు చేరలేదు. ఐకానిక్ టవర్లు కూడా ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. దాదాపు 30 అడుగుల లోతులో పునాదులు ఉన్నాయి. అంటే ఆ చుట్టూ పెద్ద గొయ్యి ఉంటుంది. అందులోనే ఇప్పుడు వరద నీరు చేరింది.
Also Read : ఎమ్మెల్యేలకు అయ్యన్న మాస్ వార్నింగ్..!
ఐకానిక్ టవర్ల కోసం ఏర్పాటు చేసిన పునాదులు ఆరేళ్లుగా బురదలోనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వాటిని కనీసం పట్టించుకోలేదు. దీంతో వాటి పటిష్ఠత పై కూడా అనుమానాలు తలెత్తాయి. దీంతో ఐఐటీ నిపుణులు ఆ ఫౌండేషన్‌ను పరిశీలించి సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ వెంటనే అక్కడ నిర్మాణ పనులను ప్రారంభించారు. భవనాలు మునిగిపోలేదని.. కేవలం పిల్లర్లు మాత్రమే మునిగాయని ఏపీ సీఆర్‌డీఏ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.