వైఎస్ కుటుంబం అంటే చాలు.. అందరికీ పులివెందుల ఠక్కున గుర్తుకు వస్తుంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట అనే పేరు. ఆ కోట బద్దలు కొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అది సాధ్యం కావటం లేదు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నం చేశారు కూడా. అయితే ఆ ఎన్నికలో పోటీ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం 5 వేల 435 ఓట్ల తేడాతో గెలిచి పరువు దక్కించుకున్నారు. వైఎస్ కుటుంబానికి ఇదే అత్యల్ప మెజారిటీ. అంతకు ముందు ఎన్నికలో 4 లక్షల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. 5 వేల మెజారిటీకే పరిమితం అవ్వటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఒక రకంగా ఈ ఎన్నికను టీడీపీ గెలుపు కిందే అభివర్ణించారు నాటి రాజకీయ విశ్లేషకులు.
Also Read : అందుకే ఫ్లాప్ అయింది.. హరిహర వీరమల్లుపై డైరెక్టర్ కామెంట్స్
ఆ తర్వాత నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే కడప పార్లమెంట్ స్థానాలను గెలుస్తూ వస్తున్నారు. ఇక 1978 నుంచి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే ఉంది. రాజశేఖర్ రెడ్డి, తర్వాత వివేకానంద రెడ్డి, తర్వాత విజయలక్ష్మి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి.. 45 ఏళ్లుగా పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఇలాంటి పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేందుకు చంద్రబాబు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా.. అది సాధ్యం కాలేదు. అయితే ఈసారి ఆ కల నెరవేర్చేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటేందుకు గట్టి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు ముందుగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను లోకేష్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి కనీసం ఒక్క స్థానం కూడా రాలేదు. అలాంటి చోట్ల కూటమి అభ్యర్థులు ఏకంగా 7 స్థానాల్లో విజయం సాధించారు. పులివెందుల, బద్వేల్, రాజంపేటలో మాత్రమే వైసీపీ గెలిచింది. రాజంపేటలో కూడా అంతర్గత విభేదాల కారణంగానే టీడీపీ ఓడిపోయింది. పులివెందులలో కూడా జగన్ మెజారిటీని 90 వేల నుంచి 60 వేలకు తగ్గించగలిగారు టీడీపీ నేతలు. ఇక ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముందుగా మహానాడును కడపలో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన మహానాడు వేడుకకు ఏకంగా 9 లక్షల మంది హాజరైనట్లు పార్టీ నేతలు వెల్లడించారు. చివరి రోజు నిర్వహించిన బహిరంగ సభకే ఏకంగా 6 లక్షల మంది పైగా హాజరయ్యారనేది పార్టీ నేతల మాట. మహానాడు గ్రాండ్ సక్సెస్‌తో కడప జిల్లా టీడీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఇప్పుడు అదే ఊపుతో ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు.
Also Read : బాబు సింగపూర్ పర్యటనతో పోయిన పరువు తిరిగొస్తుందా?
పులివెందుల, రాజంపేట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నిర్వహించనుంది. పులివెందుల జెడ్పీటీసీ సభ్యులు తుమ్మల మహేశ్వరరెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రాజీనామాతో ఒంటిమిట్టలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రెండు స్థానాల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. రెండు స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పులివెందుల స్థానం నుంచి మహేశ్వరరెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కూటమి తరఫున ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై టీడీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు టీడీపీ నేత బీటెక్ రవి ప్రకటించారు. ఆ స్థానం నుంచి రవి సతీమణి లత నామినేషన్ దాఖలు చేశారు. అలాగే రవి సోదరుడు జయభరత్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. అయితే తుది పోరులో మాత్రం లత ఉంటారని పార్టీ నేతలు వెల్లడించారు. పులివెందుల జెడ్పీటీసీ గెలుపు కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎంతో కీలకమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో ఒంటిమిట్టలో వైసీపీ నేతలకు బ్రేకులు వెసినట్లు అయ్యింది. పులివెందులలో కూడా టీడీపీ అభ్యర్థి లత గెలుపు కోసం పార్టీ ముఖ్యనేతలంతా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తే.. టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక అవుతుందనేది ఆ పార్టీ నేతల మాట. పులివెందుల జెడ్పీటీసీ గెలిస్తే.. జగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టినట్లు అవుతుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. దీంతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జగన్‌ను మరింత ఇబ్బంది పెడుతోందనే మాట బాగా వినిపిస్తోంది.