కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటారు. ప్రతి రోజు 70 వేల మంది స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నిత్యం స్వామి హుండీ ఆదాయం సగటున 4 కోట్ల రూపాయల వరకు వస్తుంది. వీటితో పాటు అన్న ప్రసాద వితరణ విరాళం, వసతి గదులు, ప్రసాద విక్రయం, హోటల్లు, దుకాణాలు.. ఇలా మొత్తంగా వందల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ డబ్బును తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక సంస్థలకు వినియోగిస్తోంది. టీటీడీ పరిధిలో తిరుపతిలో కూడా ఎన్నో విద్య సంస్థలు, ఆసుపత్రులు నడుస్తున్నాయి.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ల సందడి..!
ఇటీవల తరచూ ఓ అంశం పెద్ద వివాదాస్పదమవుతోంది. టీటీడీ నిర్వహిస్తున్న సంస్థల్లో అన్యమతస్తులు ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. కొందరు ఉద్యోగుల తీరు కూడా ఈ ఆరోపణ నిజమే అనేలా ఉంది. ఇటీవల టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. ఏఈవోగా పని చేస్తున్న రాజశేఖర్ బాబు చర్చిలో మత ప్రార్థనల్లో పాల్గొన ఫోటో బయటకు వచ్చింది. ఈ విషయంపై విజిలెన్స్ విచారణ జరిపిన టీటీడీ… రాజశేఖర్ బాబును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఏఈవోగా పని చేస్తున్న రాజశేఖర్ బాబు.. ప్రతి ఆదివారం పుత్తూరులోని స్వగ్రామంలో చర్చికి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటున్నట్లు వీడియోలు, ఫోటోలతో సహా టీటీడీకి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. టీటీడీలో పనిచేస్తూ స్వామి సొమ్ము తింటూ, హుండీలో హిందువులు కానుకలు సమర్పిస్తే.. దాంతో జీతం తీసుకుంటూ చర్చిలకు వెళ్లే ఉద్యోగులు చర్చిలను వదిలేయాలని, లేకుంటే టీటీడీని వదిలేయాలని రాధామనోహర్ దాస్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే విచారణ జరిపించిన టీటీడీ.. రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు వేసింది.
Also Read : చంద్రబాబుతో భేటీకి రేవంత్ నో..!
రాజశేఖరబాబు టీటీడీ ఉద్యోగిగా సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి.. పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. విజిలెన్స్ నివేదిక, ఇతర ఆధారాలను పరిశీలించిన టీటీడీ రాజశేఖర్ బాబుపై శాఖాపరమైన చర్యలతో పాటు సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మొదటి సారి కాదు.. సరిగ్గా 2 నెలల క్రితమే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఓ ఉద్యోగిపై అన్యమత ప్రచారం, నిర్వాహక లోపాల ఆరోపణలు వెల్లువెత్తాయి. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఆసుంతా అన్యమత ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆసుంతాపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆసుంతా పలు అక్రమాలకు పాల్పడినట్లు ఈవోకు సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ అధికారులు ఆసుంతాపై వేటు వేశారు. ఆయుర్వేదిక్ ఫార్మసీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం..!
తాజాగా మరో ఉద్యోగి వ్యవహారంపై కూడా బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఇలియాజర్ క్రైస్తవుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఆరోపించారు. కర్నూలులో టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న పనులు పర్యవేక్షణకు వెళ్లిన సమయంలో ఇలియాజర్ కారుపై.. నేను క్రైస్తవుడిని… క్రైస్తవ మతాన్ని ఆరాధించాలి.. అని ప్రచార స్టిక్కర్ వేసుకున్నారు. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. చేతిలో బైబిల్ పట్టుకుని.. ఇది నా వ్యక్తిగతం అని గొప్పగా చెప్పుకున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలియాజర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని టీటీడీ ఈవోకు లేఖ రాశారు.
టీటీడీలో పనిచేసే ఉద్యోగులు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. టీటీడీలో చేరే ముందే ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెబుతారు. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలని ఇప్పటికే భక్తుల పాటు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ టీటీడీ మాత్రం.. ఈ విషయంలో ఒకరిద్దరు ఉద్యోగులపైనే చర్యలు తీసుకుంది. అది కూడా ఎవరైనా ఫిర్యాదు చేస్తే… లేదంటే మీడియాలో ప్రసారం అయితే తప్ప.. సమగ్ర దర్యాప్తు జరిపిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించటం లేదు. టీటీడీ మాత్రం.. దర్యాప్తు చేస్తున్నామని.. చర్యలు తీసుకునేందుకు సిద్ధమని పదే పదే ప్రకటనలు చేస్తోంది. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం లేవు.
Also Read : భారత్ కు మరో స్టీవ్ బక్నర్ తయారయ్యాడు..!
తిరుమల విషయంలో ఏ చిన్న తప్పిదం జరిగినా సరే.. అది నేరుగా ప్రభుత్వానికే చెడ్డపేరు తీసుకువస్తుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంపై కూడా నాటి జగన్ టీమ్ కన్నేసింది. టికెట్ల కేటాయింపులో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే తిరుమల గోశాలలో ఆవులు చనిపోతున్నాయని మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హంగామా చేశారు. టీటీడీలో తమకు అనుకూలమైన వాళ్లు 2 వేల మంది ఉద్యోగులున్నారన్నారు కూడా. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. దీనిపై కూడా బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవులను హిందూ ఆలయాల నుంచి టీటీడీ ఎందుకు పంపించటం లేదని నిలదీస్తున్నారు. దీనిపై ఈవోకు ఘాటుగా లేఖ కూడా రాశారు. చిట్టచివరి అన్యమతస్తుడిని కూడా టీటీడీ నుంచి తొలగించే వరకు తాము పోరాటం చేస్తామన్నారు. మరి టీటీడీ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా… అన్యమతస్తుల తొలగింపు ప్రక్రియ చేపడుతుందా… వేచి చూడాలి.