వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. ఏడాది క్రితం బెట్టింగ్‌లో నష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల వెళ్లారు జగన్. ఈ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో అనుమతి ఇచ్చారు. కాన్వాయ్‌లో కేవలం 3 వాహనాలు మాత్రమే ఉండాలన.. జగన్ పర్యటనలో కేవలం వంద మందిని అనుమతిస్తామన్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు ఊరు మధ్యలో నుంచి జగన్ తన పర్యటన చేశారు. కారులో నుంచి బయటకు వచ్చి.. ఫుట్ బోర్డు మీద నిలబడి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీంతో జగన్‌ను చూసేందుకు వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున ముందుకు దూసుకువచ్చారు. ఆ తోపులాటలో సింగయ్య అనే కార్యకర్త జగన్ వాహనం కింద పడ్డాడు. ఈ ప్రమాదం మొత్తం వీడియోలో క్లియర్‌గా రికార్డ్ అయ్యింది కూడా.
Also Read : అమరావతిలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన..!
సింగయ్యను పక్కకు లాగేసిన వైసీపీ కార్యకర్తలు.. కాన్వాయ్‌ను ముందుకు పంపేశారు. ఆ తర్వాత సింగయ్యను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింగయ్య మృతి చెందాడు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ నేతల మెడకు చుట్టుకుంది. సింగయ్యను వైఎస్ జగన్ కనీసం పరామర్శించలేదని.. ఆయన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌తో పాటు వాహనంలో ఉన్న జగన్ పైన కూడా పోలీసులు కేసు పెట్టారు. సింగయ్య మృతి తర్వాత రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. ముందుగా సింగయ్య మృతిపై జిల్లా ఎస్పీ ఆఘమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టారు. కాన్వాయ్‌లో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం వల్లే సింగయ్య మృతి చెందినట్లు ఓ నంబర్ కూడా చెప్పారు. అయితే ప్రమాదం అసలు వీడియో బయటకు రావడంతో వైసీపీ నేతలకు అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. ముందుగా అది ఏఐ వీడియో అని బుకాయించిన వైసీపీ నేతలు.. చివరికి అది ఒరిజినల్ తేలడంతో సైలెంట్ అయ్యారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే.. సింగయ్య ఎవరో కాదు.. మా కార్యకర్త.. కిందపడ్డాడు.. అయితే ఏంటి అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. చివరికి సింగయ్య భార్యను ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించారు జగన్. అక్కడ సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. సింగయ్య భార్యు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాతే అసలు రాజకీయం బయటకు వచ్చింది. తన భర్త మృతిపై అనుమానాలున్నాయంటూ 15 రోజుల తర్వాత సింగయ్య భార్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రమాదంలో తన భర్తకు చిన్న చిన్న గాయాలే అయ్యాయని.. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగిందన్నారు. అసలు ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదని కూడా ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలనే వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
Also Read : సిఎం వర్సెస్ డిప్యూటి సిఎం.. కన్నడ నాట ఏం జరుగుతోంది..?
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులో ఉంది. గూగుల్ పుణ్యమా అని గతంలో జరిగిన విషయాలు అన్ని ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. అలాంటిది పది రోజుల క్రితం సింగయ్య భార్య చెప్పిన మాటలను ఏపీ ప్రజలు ఎలా మర్చిపోతారు. జగన్ వస్తున్నారని తెలిసి చూడటానికి సింగయ్య వెళ్లాడని.. అక్కడ కారు తగిలి కిందపడిపోయాడని.. అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు కూడా తనతో మాట్లాడారని.. తనకు ఇద్దరు పిల్లలున్నారని కూడా సింగయ్య చెప్పినట్లు ఆమె స్వయంగా మీడియా ముందు వెల్లడించారు. ఊరి పేరు, తండ్రి పేరు, భార్య పేరు కూడా చెప్పాడని.. ఆమె స్వయంగా వివరించారు. ఆసుపత్రికి వచ్చిన తర్వాతే మృతి చెందినట్లు తెలిపారు. కానీ.. జగన్‌ను కలిసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు.. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు.. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు అంబులెన్స్‌లో ఏదో జరిగింది.. నా భర్త మృతిపై అనుమానాలున్నాయి.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి జగన్ వాహనం టైరు కింద సింగయ్య పడిపోవడం నిజం. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే.. బతికేవాడు. కానీ వైసీపీ కార్యకర్తలు.. సింగయ్యను బయటకు తీసిన తర్వాత పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. ఆ కాన్వాయ్ గోల వెళ్లే వరకు అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు. మీడియాలో ఫోటోలు బాగా వైరల్ అయిన తర్వాత అంబులెన్స్ ఎక్కించి పంపారు. ఇక సింగయ్య చనిపోయినట్లు తెలిసిన వెంటనే.. ఆఘమేఘాల మీద అంబటి ఆ ఊరు వెళ్లి.. 10 లక్షలు సాయం అందించారు. కానీ వీడియో వైరల్ అయిన తర్వాత మానవత్వం లేని జగన్ అని అంతా విమర్శలు చేశారు.
Also Read : తొలి అడుగులో బీటలు.. ఎందుకిలా..?
నిజానికి నిన్నటి వరకు ఎవరూ ఈ పాయింట్ రైజ్ చేయలేదు. వైసీపీ నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి.. సింగయ్య వీడియో ఏఐ ఏఐ అని పదే పదే చెప్పారు తప్ప.. ఇలా అనుమానం మాత్రం వ్యక్తం చేయలేదు. ఇక సింగయ్య మృతిపై అనుమానం ఉంటే.. 15 రోజుల వరకు ఎందుకు ఈ మాట బయట పెట్టలేదు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇన్ని రోజులు రాని అనుమానం.. తాడేపల్లి ప్యాలెస్‌లో నుంచి బయటకు వచ్చిన తర్వాతే రావడం ఏమిటనేది టీడీపీ నేతల ప్రశ్న. సింగయ్య భార్య చెప్పిన ఆరోపణలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సింగయ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. సింగయ్య భార్య చెప్పిన కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.