వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఏడాది మాత్రమే అయ్యింది. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట తీరు చూస్తే మాత్రం.. మరో ఏడాదిలోనే ఎన్నికలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉంటా అని గొప్పగా చెప్పిన జగన్.. రెండోసారి కూడా గెలవలేదు. ఐదేళ్ల అరాచక పాలన కారణంగా జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు జగన్ వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెలకోసారి వచ్చిన జగన్.. ఇప్పుడు మాత్రం రెండు వారాలకోసారి ఏపీలో పర్యటిస్తున్నారు. ఇక వచ్చిన ప్రతిసారి కూటమి సర్కార్ పైన.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనపైన విమర్శలు చేస్తున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో మళ్లీ తానే అధికారంలోకి వస్తా అంటు ధీమాగా చెబుతున్నారు.
Also Read : అదరగొడుతున్న పెమ్మసాని స్పీచ్ లు
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది. మరోసారి అధికారంలోకి రావటానికి ఇంకా నాలుగేళ్ల సమయం జగన్‌కు ఉందనేది ఆ పార్టీ నేతల మాట. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేశాయి. 3 పార్టీలు కలిసి ఏకంగా 164 సీట్లు సొంతం చేసుకున్నాయి. ఈ పొత్తు రాబోయే ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఇప్పటికే మూడు పార్టీల నేతలు స్పష్టం చేశారు. టీడీపీతోనే తన ప్రయాణం అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తేల్చేశారు. అటు టీడీపీ కూడా ఎన్డీయేతోనే ఉంటుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయనే విషయం తేలిపోయింది. అంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధినేత ఈ మూడు పార్టీలతో కలిసి పోటీ పడాల్సిందే అనేది రాజకీయ విశ్లేషకులు మాట.
Also Read : కొడాలి అనుచరుల పెత్తనం.. ఆయన మాటే వేదం..!
నాలుగేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ జగన్ మాత్రం ఇప్పటి నుంచే అధికారం కోసం తాపత్రయ పడుతున్నారు. పవర్‌లోకి ఎలా రావాలనే విషయంపై నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ప్రజలకు తాను ఐదేళ్లు ఎంతో మేలు చేశానని.. ప్రజలకు లక్షల కోట్ల రూపాయలు పంచిపెట్టినట్లు ఇప్పటికీ చెబుతున్నారు. అదే సమయంలో కూటమి సర్కార్‌పై ఇప్పటి నుంచే ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. హామీలు అమలు చేయడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. అలాగే కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను ప్రజలకు మరోసారి వివరించాలని పార్టీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల పేరుతో చంద్రబాబు జనాలను మోసం చేశారని.. అందుకే టీడీపీ నేతలను నిలదీయాలంటున్నారు జగన్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ కూడా తయారు చేశారు. అది స్కాన్ చేస్తే.. టీడీపీ ఇచ్చిన హామీల జాబితా వస్తుందని జగన్ వెల్లడించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కూటమి హామీలను వైసీపీ నేతలు ప్రచారం చేయడం ఏమిటనేది ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. సొంత పార్టీ గురించి తక్కువ.. టీడీపీ గురించే ఎక్కువ ప్రచారం చేస్తున్నామనేది వైసీపీ నేతల మాట.
Also Read : మంత్రులలో ప్రోగ్రెస్ రిపోర్ట్ భయం..?
ఇక రెండు రోజుల క్రితం పార్టీ సమన్వయకర్తలతో సమావేశమైన వైఎస్ జగన్.. మూడేళ్ల తర్వాత తానే అధికారంలోకి వస్తా అని గొప్పగా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ 52 స్థానాల్లో గెలుస్తుందన్నారు. ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పార్టీ బలోపేతమైందన్నారు. రాబోయే మూడేళ్లు మరింత కష్టపడితే 150 పైగా సీట్లు సాధించడం పెద్ద కష్టమైన పని కాదన్నారు కూడా. జగన్ చెబుతున్న మాటలు చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. అధికారం కోల్పోయిన ఏడాదిలోపే కుర్చీ కోసం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ప్రజా సమస్యలపై కనీసం అసెంబ్లీలో కూడా ప్రశ్నించని నేత.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారని ప్రజలు నిలదీస్తే.. ఏం జవాబు చెప్పాలని సొంత పార్టీ నేతలే మల్లగుల్లలు పడుతున్నారు.