మరో సూపర్ సిక్స్ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో పింఛన్ పెంపు, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాల కల్పన వంటి హామీలను అమలు చేస్తున్నారు. ఇక కీలకమైన మరో రెండు హామీల అమలుకు కూడా ఇప్పటికే తేదీ ప్రకటించారు. తల్లికి వందనం పేరుతో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, అన్నదాత పేరుతో ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ రెండు పథకాలను జూన్ 12న అమలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రైతుల అకౌంట్‌లో ఏటా రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేస్తామని ప్రకటించారు. ఇది కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా మరో రూ.8 వేలు కూడా రైతుల అకౌంట్‌లే వేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
Also Read : ఎందుకీ మౌనం.. సైలెంట్ అయిపోయిన వైసీపీ సోషల్ మీడియా
తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించిన సమయంలో చంద్రబాబు మరో కీలక పథకం అమలు తేదీ ప్రకటించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో అర్హులైన ప్రతి మహిళలకు ఉచిత బస్సు ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామంటూ ప్రజల చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలను చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Also Read : టీడీపీ రూట్ మ్యాప్.. మహానాడులో అన్నీ సంచలనాలే
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయనున్నట్లు ప్రకటించిన చంద్రబాబు… ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమందికీ పథకం వర్తింప చేస్తామన్నారు. అలాగే రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీపై ఇప్పటికే విపక్షాలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పలుమార్లు బస్సులోనే ప్రయాణం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ నేతలు కూడా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయటం లేదంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటికి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు బదులిచ్చినట్లు అవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలు జూన్ 12న, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కానున్నాయి. వీటితో వైసీపీ నేతలకు కూటమి సర్కార్ చెక్ పెట్టినట్లైంది.