మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు బాలినేని. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చిన తర్వాత బాలినేని కూడా జగన్‌కు మద్దతు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన వెంటనే మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్‌తో కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. నాటి నుంచి జగన్ వెంటే ఉన్నారు బాలినేని. ఓ వైపు ప్రకాశం జిల్లాలో సొంత బావ వైవీ సుబ్బారెడ్డితో వర్గపోరు ఉన్నప్పటికీ.. జిల్లాలో వైసీపీ బలోపేతానికి తన వంతు కృషి చేశాడు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను బిల్డప్ చేసుకున్నాడు బాలినేని. అయితే వైవీతో పాటు జిల్లాలోని కొందరు వైసీపీ నేతల కారణంగా బాలినేని తీవ్ర ఇబ్బందులు పడ్డాడనేది వాస్తవం. చివరికి జగన్ ప్రభుత్వంలో బాలినేని పలుమార్లు అవమానానికి కూడా గురయ్యాడు.
Also Read : కొడాలి నానీ అక్రమాలపై గురి పెట్టినట్టేనా…?
మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో బాలినేనిని మంత్రిపదవి నుంచి జగన్ తప్పించారు. అదే సమయంలో జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలినేని ఒకదశలో రాజకీయాల నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే జగన్ స్వయంగా పలుమార్లు బుజ్జగించడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ భవిష్యత్ అంచనా వేసిన బాలినేని… ఏపీలో మరోసారి వైసీపీ గెలుపు కష్టమని భావించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిపోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన రాకతో ప్రకాశం జిల్లాలో కూటమి సర్కార్‌కు కొండంత బలం వచ్చినట్లైంది. అదే సమయంలో తన రాజకీయ చతురతతో.. ఒంగోలు కార్పొరేషన్‌ను జనసేన సొంతం చేసుకుంది కూడా.
Also Read : అఖిల్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. నాగార్జున నమ్మకం అదే..?
రాబోయే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ ఇప్పటి నుంచే జిల్లాలో జోరుగా జరుగుతోంది. వాస్తవానికి బాలినేని, దామచర్ల మధ్య తొలి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ప్రభుత్వంలో ఇద్దరు నేతలు పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. బాలినేని జనసేనలో చేరినప్పటికీ… ఈ ఇద్దరు నేతలు ఇప్పటి వరకు కలిసిన సందర్భం లేదు. చివరికి సీఎం చంద్రబాబు పర్యటనలకు కూడా బాలినేని దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలినేని ఒంగోలు నుంచి పోటీ చేస్తారా.. లేక మరో నియోజకవర్గానికి మారిపోతారా అనే చర్చ నడుస్తోంది.
Also Read : రంగన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది…?
ఇటీవల హైదరాబాద్‌లోని ఇంట్లో తన వర్గం నేతలతో బాలినేని సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో రాబోయే ఎన్నికల్లో కూడా అసెంబ్లీకే పోటీ చేయాలని బాలినేని వెల్లడించినట్లు సమాచారం. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఒంగోలు నుంచి దామచర్ల జనార్థన్‌ను తప్పించి తనకు సీటు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కాబట్టి… రాబోయే ఎన్నికల్లో ఒంగోలు బదులుగా మార్కాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తన అనుచరులకు బాలినేని సూచించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే బాలినేని నియోజకవర్గం మారిపోతారనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. కానీ ఈసారి మాత్రం మార్పు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు మరో కారణం కూడా చెబుతున్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి మార్కాపురం జిల్లాకు మారిపోతే… ఆ జిల్లా పరిధిలో తన పట్టు కొనసాగుతుంది అనేది బాలినేని ప్లాన్. ప్రస్తుత మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఇప్పటికే 5 సార్లు పోటీ చేసినప్పటికీ… కేవలం 2 సార్లు మాత్రమే గెలిచారు. కందుల బ్రదర్స్‌పై నియోజకవర్గంలో కొంత చెడ్డపేరు కూడా ఉంది. కాబట్టి… రాబోయే ఎన్నికల్లో కందులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. అందుకే మార్కాపురం నియోజకవర్గాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న బాలినేని మాస్టర్ ప్లాన్ వేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.