తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో కొందరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వారిలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకరు. 1989 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. తొలిసారే మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు కూడా. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేత అయినప్పటికీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు కూడా. జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయి కూడా. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరారు ధర్మాన సోదరులు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు మంత్రిపదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని నేతలుగా కొనసాగుతున్న ధర్మాన సోదరులు కొద్దికాలంగా సైలెంట్ అయ్యారు.
Also Read : ఏపీపై కేంద్రం మరోసారి స్పెషల్ లవ్
గత ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో నుంచి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నియోజకవర్గం నుంచి ధర్మాన కృష్ణ దాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. పేరుకే జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ కృష్ణ దాస్ మాత్రం అప్పుడప్పుడు పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు మాత్రం రెండేళ్ల వరకు తన జోలికి రావద్దని కార్యకర్తలకి పార్టీ నేతలకు తెగేసి చెప్పేశారు. ఇప్పుడు బయటకు వచ్చి పెద్ద ఉపయోగం లేదని, అసలు బయటికి రావాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు కూడా. చివరికి పార్టీ కార్యాలయం ఎంపిక కోసం పక్క జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ వచ్చారు తప్ప ధర్మాన మాత్రం కాలు బయట పెట్టలేదు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మాన బ్రదర్స్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : నందిగం సురేష్ ను దూరం పెట్టేసిన జగన్..?
ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీ పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయస్ జగన్ పాలకొండ వెళ్లారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున రావాలని పిలుపు ఇచ్చారు కూడా. అయితే దీనికి పెద్దగా ఎవరు స్పందించినట్లు లేకపోవడంతో ధర్మాన ప్రసాదరావు స్వయంగా రంగంలోకి దిగారు. నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తన అభిమానులతో కలిసి పాలకొండ చేరుకున్నారు.
Also Read : కేసుల భయమా..? నియోజకవర్గంలో చిచ్చా..?
అయితే ధర్మాన బ్రదర్స్ బయటికి రావడం వెనుక జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఊహించుకొని ధర్మాన బ్రదర్స్ భయపడుతున్నారనే మాట వినిపిస్తోంది. జిల్లా అధ్యక్ష పదవి నుంచి ధర్మాన కృష్ణ దాసుని తప్పిస్తారని పుకార్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. మరోవైపు కుమారుడి ఆపరేషన్ తర్వాత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లాలో యాక్టివ్ అయ్యారు. అటు మరో మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు కూడా జిల్లా అధ్యక్ష పదవి పై కన్నేశారు. త్వరలో జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు విశ్వశ్వరాయి కళావతి, రెడ్డి శాంతి తో పాటు ప్రస్తుత చైర్పర్సన్ పిరియా విజయ కూడా చైర్మన్ సీట్ కోసం పోటీ పడుతున్నారు. ఇంత మంది నేతల నుంచి తమకు రాజకీయ పోటీ రావడంతో జిల్లాపై తమ పెత్తనం చేయి జారుతుందని ధర్మాన బ్రదర్స్ భయపడుతున్నట్లు తెలుస్తుంది.