వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. వై నాట్ 175 అని ఎన్నికల్లోకి వెళ్లారు. సిద్ధం అంటూ సభలు పెట్టారు. పెద్ద పెద్ద హామీలిచ్చారు. అలాగే 30 ఏళ్ల పాటు తానే అధికారంలో ఉంటా అంటూ గొప్పలు కూడా చెప్పారు. అయితే చివరికి వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇక టీడీపీ నేతలపై అసెంబ్లీ వేదికగా గతంలో చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు భయపడినట్లున్నారు. గతంలో జరిగిన అరాచకాలను, అవినీతిపై కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తే వాటికి జవాబు చెప్పలేని పరిస్థితి. అందుకే అసెంబ్లీకి వెళ్లకుండా మొహం చాటేశారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి రాకుండా దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలోనే వ్యాఖ్యానించారు కూడా.
Also Read : ఉక్రెయిన్ మాస్టర్ మైండ్.. ఒక్క అటాక్ తో రష్యాకు షాక్.. అమెరికాకు వార్నింగ్
ఇక జగన్ ఓడిన తర్వాత వైసీపీ పరస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. కీలక నేతలంతా జగన్‌కు దూరంగా వెళ్లిపోతున్నారు. గతంలో ఆహా ఓహో అంటూ పొగిడిన నేతలే ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. సొంత బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి మొదలు… అక్రమాస్తుల కేసులో సహ నిందితుడు మోపిదేవి వెంకటరమణ వరకు అంతా జగన్‌కు దూరమైన వారే. చివరికి అక్రమాస్తుల కేసులో ఏ2గా జగన్‌తో పాటు 16 నెలలు జైలు జీవితం అనుభవించిన విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు కూడా మాకొద్దు జగన్ అనేస్తున్నారు.
Also Read : తిరుమలపై వైసీపీ భారీ కుట్ర..!
జగన్ చుట్టూ కోటరీ చేరిందనేది తొలి నుంచి వినిపిస్తున్న మాట. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి కేవలం ఇద్దరు ముగ్గురు నేతల మాటలనే జగన్ వింటున్నాడని.. మంత్రులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దక్కలేదనేది ప్రధాన ఆరోపణ. జగన్ చుట్టూ చేరిన కోటరీలో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డి పేర్లు మాత్రమే వినిపించాయి. ఇక పార్టీ నెంబర్ టూ స్థానం కోసం ఒక దశలో పెద్ద ఎత్తున ఆధిపత్య పోరు జరిగింది. ఇందులో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా బాగా వినిపించింది.
ఎన్నికల ఫలితాల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ ఓడిపోయిందనే మాట బాగా వినిపించింది. అయినా సరే జగన్ మాత్రం సజ్జలకే మరోసారి పార్టీ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరికి విజయసాయిరెడ్డి వంటి అత్యంత నమ్మకమైన వ్యక్తి కూడా పరోక్షంగా సజ్జలపై విమర్శలు చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు. అయినా సరే.. జగన్ మాత్రం సజ్జలపై ఈగ వాలనివ్వలేదు. ఇదే ఇప్పుడు మరో నేత మౌనానికి కారణమైంది. వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత తీరుపై కాస్త ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఎవరు గెలిచినా చరిత్రే.. ఆసక్తిగా ఐపిఎల్ ఫైనల్
వైవీ సుబ్బారెడ్డి తొలి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఆయనకు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా వైవీని నియమించారు. రెండు సార్లు వైవీ పదవి దక్కుంచుకున్నారు. నాలుగేళ్ల పాటు ఛైర్మన్ పదవిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి హయాంలోనే ఎన్నో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత చివర్లో వైవీకి రాజ్యసభ అవకాశం ఇచ్చారు జగన్. అలాగే పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమించారు. ఇక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సుబ్బారెడ్డి వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించటం లేదు.
Also Read : అయ్యర్ క్లాస్ హిట్టింగ్.. ప్యూర్ టెక్నిక్
టీటీడీలో గతంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను కూడా కూటమి సర్కార్ చేస్తోంది. అయినా సరే.. నాలుగేళ్ల పాటు ఛైర్మన్ పదవి నిర్వహించిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక టీటీడీపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. వైవీ మాత్రం పల్లెత్తు మాట అనటం లేదు. గోశాల వివాదం, వైకుంఠ ఏకాదశి టికెట్ల తొక్కిసలాట ఘటన, క్యూ లైన్‌లో భక్తుల ఆందోళన వంటి విషయాలపై కూడా వైవీ మాట్లాడలేదు. గతంలో జగన్ వెంటే ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. ఇప్పుడు మాత్రం అసలేమయ్యారో తెలియటం లేదు. లిక్కర్ స్కామ్‌లో జగన్ అరెస్టు ఖాయమని అంతా అంటున్నా కూడా వైవీ సుబ్బారెడ్డి నో రెస్పాన్స్, ఇక పార్టీ సమావేశాల్లో కూడా వైవీ పాల్గొనటం లేదు. చిన్నగా జగన్‌కు వైవీ దూరంగా వెళ్తున్నారా అని వైసీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.