వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ పార్టీ శాసనమండలి సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిపక్ష హోదా లేదనే కుంటి సాకుతో అసెంబ్లీకి పోకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నాడు. నేను రాను కాబట్టి.. మీరు కూడా వద్దని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేశాడు. ఇదే సమయంలో సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్సీలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. మీరు వెళ్లండి… ప్రభుత్వాన్ని నిలదీయండి అని వాళ్లను రెచ్చగొట్టాడు. అయితే ఇలా పెద్దల సభకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీల పరిస్థితి ముందు నుయ్యి… వెనుక గొయ్యి మాదిరి తయారైంది. ప్రభుత్వాన్ని నిలదీయలేరు… ప్రభుత్వం చెప్పే సమాధానాలను అంగీకరించలేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
Also Read : పాకిస్తాన్ ను ఇరికించిన బీసిసిఐ
వాస్తవానికి గతంలో 23 మంది సభ్యులున్నప్పుడే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రతి రోజు ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను సభలో నిలదీశారు. ఇక పెద్దల సభలో బలం కారణంగా జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక బిల్లులను మండలిలో అడ్డుకున్నారు కూడా. మూడు రాజధానుల బిల్లుతో పాటు మండలి రద్దు వంటి బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు సభలో పాస్ కాకుండా ఆపగలిగారు. దీంతో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నా కూడా జగన్ ఆటలు సాగలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది.
కూటమి ప్రభుత్వానికి శాసనసభలో 164 మంది సభ్యులున్నారు. మండలిలో మాత్రం వైసీపీకే బలం ఎక్కువ. అయినా సరే… ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన బిల్లులను అడ్డుకోలేకపోతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఎందుకంటే… అవన్నీ ప్రజలకి ఉపయోగకరమైనవే కాబట్టి. ఇక సభకు దూరంగా ఉన్నప్పటికీ… మండలి మాత్రం కాస్త హాట్ హాట్‌గా సాగుతోందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందుకు ఏపీ మంత్రులు ధీటుగానే జవాబు ఇస్తుండటంతో… ఏం చేయాలో దిక్కుతోచని స్థితి వైసీపీ నేతలది.
Also Read : బోరుగడ్డ దెబ్బకు జీవితం నాశనం చేసుకున్న మరో ఖాకీ
మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని… దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుద కల్యాణి సభలో ప్రస్తావించారు. అలాగే గత ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనికి మంత్రి వంగలపూడి అనిత ధీటుగా జవాబిచ్చారు. అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించడంతో వైసీపీ నేతలు సైలెంటయ్యారు. దాడులు ఎవరి హయాంలో జరిగాయో చూడండి అంటూ సభలో అంకెలు చెప్పడంతో మారు మాట్లాడలేదు. ఇక రుషికొండ ప్యాలెస్ విషయంలో కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సభలోనే ప్రస్తావించారు.
అవి ప్రభుత్వ భవనాలని… వాటిని రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాని, కేంద్ర మంత్రులు సీఎం విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వినియోగించాలని సూచించారు. అయితే దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగానే బదులిచ్చారు. అసెంబ్లీ, మండలి, సెక్రటేరియేట్ భవనాల కోసం చదరపు అడుగుకు రూ.4 వేలు ఖర్చు చేస్తే… ఆరు రోజులు సభలో చర్చించారని… మరి ఏ ఉపయోగం లేని రుషికొండ ప్యాలెస్ కోసం చదరపు అడుగు రూ.24 వేల ఎలా ఖర్చు చేశారని నిలదీశారు. దీంతో బొత్స సైలెంట్‌గా సైడ్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు… ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలకు ఓకే చెప్పలేరు అన్నట్లుగా వైసీపీ ఎమ్మెల్సీల పరిస్థితి మారిపోయింది. దీంతో కొందరు సొంత పార్టీ నేతలే పాపం.. వైసీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు.