Friday, September 12, 2025 03:02 PM
Friday, September 12, 2025 03:02 PM
roots

ఎవరు ఎవర్నీ మోసం చేశారు..?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారు. అలాగే ఎవరైనా సూపర్ సిక్స్ పథకాలు అమలు కావటం లేదని అంటే మాత్రం.. వాళ్లకు నాలుక మందం అని కూడా వ్యాఖ్యానించారు. నెల రోజుల క్రితం వరకు ప్రతి రోజూ కూడా తల్లికి వందనం ఎప్పుడూ.. అని పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ నేతలు. అయితే ముందు నుంచి చెబుతున్నట్లుగానే సరిగ్గా విద్యా సంవత్సరం ప్రారంభం రోజున జూన్ 12వ తేదీనే తల్లికి వందనం విడుదల చేశారు. అది కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హత ఉన్న చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే.. అంత మందికి తల్లికి వందనం రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందిగా మారింది.

Also Read : ఏం చేసుకుంటావో చేసుకో.. ట్రంప్ కు మస్క్ వార్నింగ్

2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ప్రధాన కారణం అమ్మఒడి పథకం. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే.. అంతమందికి 15 వేల రూపాయలు ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నవరత్నాల పేరుతో 9 హామీలు కూడా ఇచ్చారు. అలాగే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేసిన పాదయాత్రలో లెక్క లేనన్ని హామీలు కూడా ఇచ్చారు. ఇవన్నీ వైసీపీ గెలుపునకు కారణమయ్యాయి. కానీ అదే వైసీపీ 2024లో ఓడిపోవడానికి కూడా ఇవే హామీలు కారణమయ్యాయనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్. అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పథకం అమలులో మార్పులు చేశారు. ముందు ప్రతి విద్యార్థి అని చెప్పిన జగన్.. తర్వాత తల్లికి మాత్రమే అని మాట మార్చారు. అలాగే ముందు 15 వేలు జమ చేసిన వైసీపీ సర్కార్.. ఆ తర్వాత అందులో 2 వేల రూపాయలు కోత విధించడం కూడా ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇక ఎన్నికల్లో జగన్ ఇచ్చిన అతి ముఖ్యమైన హామీల్లో ఒకటి జాబ్ క్యాలెండర్.. ప్రతి ఏటా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో కనీసం ఒక్కసారి కూడా ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదు.

Also Read : వైసీపీ మైండ్ గేమ్.. వర్కవుట్ అవుతుందా..?

ఉద్యోగులు అయితే వైసీపీ ఐదేళ్ల పాలన గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు జగన్. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. కానీ ఐదేళ్లల్లో సీపీఎస్ ఊసే లేదు. విజయవాడలో ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేయడంతో.. సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ తీసుకువచ్చారు. అలాగే పీఆర్సీ కోసం డిమాండ్ చేసిన ఉపాధ్యాయులను జైలులో పెట్టారు. ఉద్యోగులు జీతం పెంచాలన కోరితే.. తగ్గించారు. ఇక జీతం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి.. ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితికి చేరుకుంది. దీని వల్ల చాలా మంది ఉద్యోగులు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేక సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోవడంతో.. బ్యాంకుల్లో డిఫాల్టర్‌గా మారిపోయారు. దీని వల్ల పిల్లల చదువులకు కూడా లోన్లు తీసుకోలేకపోయారు. ఇప్పటికీ ఆ రోజులు తలుచుకుని ఉద్యోగులు భయపడుతూనే ఉన్నారు.

Also Read : ఆ నలుగురికి చంద్రబాబు మాస్ వార్నింగ్..!

ఇక మద్య నిషేధం గురించి ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తాం అని గట్టిగా చెప్పారు. అలాగే కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లల్లో మాత్రం అందుబాటులో ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా మద్యం ధరలు డబుల్, ట్రిబుల్ చేసేశారు. పైగా నాసి రకం మద్యం సరఫరా చేశారు. మద్య నిషేదం చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. 25 ఏళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి అప్పు చేశారు. నాసిరకం మద్యం వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం స్కామ్‌లో వేల కోట్లు దోచేసినట్లు ఇప్పటికీ ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది కూడా.

Also Read : కేసీఆర్ కోసమే బీజేపీ నిర్ణయమా..?

ఇక 25 ఎంపీ స్థానాలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు జగన్. ప్రత్యేక హోదా వల్ల ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు కూడా. మరి 22 ఎంపీ స్థానాలను గెలిచిన తర్వాత ఐదేళ్లల్లో కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని ప్రత్యేక హోదా కూడా ప్రశ్నించలేదు. ప్రత్యేక హోదానే ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్.. ఐదేళ్ల పాటు ఆ విషయం పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మోదీ, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఏం మాట్లాడారు సార్.. అని ఎవరైనా అడిగితే.. నో ఆన్సర్. ఇక అన్నిటకంటే ప్రధానమైన అంశం రాజధాని. వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని నిర్మిస్తా అంటూ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్. అలాగే తన ఇల్లు అమరావతి పరిధిలోనే ఉందని.. కాబట్టి ఏపీ రాజధాని అమరావతి అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. రాజధాని రాష్ట్రంగా ఐదేళ్లు చేసారు.

Also Read : ఆ టీడీపీ మహిళా ఎమ్మెల్యేలే తేడానా..?

ఇక మైనారిటీలకు దుల్హన్ పధకం కింద లక్ష రూపాయలు ఇస్తామన్నారు జగన్. కానీ అప్పటి వరకు ఇచ్చిన 50 వేలు కూడా ఎగ్గొట్టారు. ఇక పోలవరం నిర్వాసితులకు ఒక్కొక్కరికి 19 లక్షల రూపాయలు ఇస్తానని 2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రివర్స్ టెండర్ పేరుతో పనులు ఆపేశారు. దీని వల్ల కాఫర్ డ్యామ్‌ డ్యామేజ్ అయ్యింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడేసింది వైసీపీ సర్కార్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 934 కోట్లను నిర్వాసితులకు విడుదల చేసింది. సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు ప్రకాశం జిల్లా దోర్నాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన జగన్.. వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. పూర్తి కాకుండానే ఎలా ప్రారంభం చేశారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇలా చెప్పుకుంటూ పోతే.. లెక్కలేనన్ని ఉన్నాయి. హామీలు ఇచ్చి గాలికి వదిలేసినవ ఎన్నో ఉన్నాయి. అయినా సరే.. ఇవన్నీ మర్చిపోయిన జగన్.. కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలను నిలువునా మోసం చేశారని.. కాబట్టి వాటిని ప్రతి ఒక్కరు గమనించాలంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. స్కాన్ చేసి.. కూటమి సర్కార్ వైఫల్యాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వైసీపీ నేతలు గ్రామాల్లోకి వస్తే.. ఇచ్చిన హామీలను, ఐదేళ్లల్లో చేసిన మోసాలను గుర్తు చేయాలని టీడీపీ నేతలు పిలుపునిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్