హత్యాయత్నం కేసులో వైసీపీ నేత గౌతంరెడ్డి మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే ఒకసారి పోలీసులను తప్పించుకు తిరిగిన ఆయన.. బెయిల్ పిటిషన్ పేరుతో బయటకు వచ్చారు. తాజాగా కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో.. మరోమారు పోలీసుల కళ్లుగప్పి పారిపోవడంతో వేట మొదలైంది. గౌతంరెడ్డి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇటీవల ఆకస్మికంగా ఇంటిలో తనిఖీలు చేసినప్పటికీ.. గౌతంరెడ్డి ఆచూకీ లభించకపోవడంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
Also Read : వైసీపీలో వేరే లీడర్లే లేరా..? జగన్ పై క్యాడర్ ఫైర్..!
విజయవాడ సత్యనారాయణపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉమామహేశ్వరశాస్త్రి పై సుపారీ గ్యాంగ్‌తో హత్యాయత్నం చేయించిన వైసీపీ నేత గౌతంరెడ్డి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన ఆశలకు న్యాయస్థానం బ్రేక్ వేసింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని గౌతంరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కోర్టు ఇటీవల డిస్మిస్ చేసింది. దీంతో పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన గౌతంరెడ్డి.. రాత్రికి రాత్రి నగరం నుంచి పారిపోయాడు.

నవంబర్ 6వ తేదీన ఉమామహేశ్వరశాస్ర్తిపై సుపారీ గ్యాంగ్ హత్యాయత్నం చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మంది నిందితుల్లో మరో ఇద్దరు పోలీసులకు చిక్కాల్సి ఉంది. వారిలో గౌతంరెడ్డి ఒకరు కాగా, ఆయన అనుచరుడు పురుషోత్తం రెండో నిందితుడు. ఇందులో సనత్ నగర్‌కు చెందిన పురుషోత్తం లా కోర్సు చదువుతున్నాడు. అతడికి పరీక్షలు ఉండటంతో హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
ఇదిలా ఉంటే పోలీసులపైనే ఆరోపణలు చేస్తూ గౌతంరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. మరోపక్క పోలీసులపైకి న్యాయవాదులను ఉసిగొల్పే ప్రయత్నాలు చేశాడు. గౌతంరెడ్డి పాత నేరచరిత్రను సైతం పైకి తీసిన పోలీసులు… అతడికి సంకెళ్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు హైకోర్టు ఆదేశాలతో ముందుకు అడుగులు వేయకుండా ఉన్న పోలీసులు.. ప్రస్తుతం దూకుడు పెంచారు.
Also Read : జమిలీపై చంద్రబాబు హాట్ కామెంట్స్
గౌతంరెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. గౌతంరెడ్డి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండగా.. వేర్వేరు నెంబర్లతో అనుచరులు, న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది. ఎక్కువగా వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి కడపకు కానీ, బెంగళూరుకు కానీ వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.




