వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద పెద్ద టాస్కులు ఇస్తున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది. కానీ జగన్ మాటల్లో మాత్రం.. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు.. అప్పుడు ప్రజలంతా తన వెంటే ఉంటారు.. కాబట్టి మళ్లీ తానే సీఎం కుర్చీలో కూర్చుంటా అని బలంగా చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో కావాల్సినంత వ్యతిరేకత ఉందంటున్నారు. ఇక కూటమి సర్కార్ ఏడాది కాలంగా ప్రజలను మోసం చేస్తోందని.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటున్నారు కూడా. దీనిపై ఇప్పటికే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పదే పదే ఆరోపిస్తున్నారు. కూటమి సర్కార్ అనే మాట కంటే కూడా కేవలం చంద్రబాబు పాలన అని మాత్రమే జగన్ చెబుతున్నారు.
Also Read : చంద్రబాబు, పవన్ అభిప్రాయం తర్వాతే బిజెపి ఆ నిర్ణయం..?
చంద్రబాబు పాలన అస్తవ్యస్తమని పదే పదే చెబుతున్న జగన్.. తాజాగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పెద్ద పని అప్పగించారు. ఓ వైపు గడప గడపకు ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి కూటమి సర్కార్ ఏడాది పాలనలో చేసిన మేలు వివరించాలని.. అలాగే ప్రతి కుటుంబానికి అందిన సాయం గురించి కూడా వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇక్కడే వైసీపీ అధినేత ఆ పార్టీ నేతలకు కూడా సరిగ్గా ఇలాంటి టాస్క్ ఇచ్చారు. ప్రతి వైసీపీ కార్యకర్త గడప గడపకు వెళ్లాలని సూచించారు. వైసీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఆ పార్టీ నేతలకు ఎదురవుతోంది.
Also Read : విలువలు, విశ్వసనీయతలో ఎప్పుడూ రాజీపదలేదన్న జగన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా?
వాస్తవానికి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అలాగే చాలా మంది నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. విడదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్ వంటి మాజీ మంత్రులతో పాటు సగానికి పైగా ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో.. సరిగ్గా ఎన్నికల సమయంలో దాదాపు 50 నియోజకవర్గాల్లో నేతలను జగన్ మార్చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2019లో ఎన్నికైన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను 2024 నాటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మార్చేశారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టేశారు. అలాగే గుంటూరు వెస్ట నుంచి పోటీ చేసిన విడదల రజినీని మళ్లీ చిలకలూరిపేటకు మార్చేశారు. ఆమె స్థానంలో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును దిగుమతి చేశారు. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులను కూడా జగన్ మార్చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం.. మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జున రెడ్డిని గిద్దలూరు మార్చేశారు. ఇద్దరు నేతలు ఓడిపోయారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50కి పైగా నియోజకవర్గాల్లో జగన్ మార్పులు చేర్పులు చేశారు.
Also Read : ఎవరు ఎవర్నీ మోసం చేశారు..?
ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ తర్వాత నుంచి కనిపించటం లేదు. మల్లాది విష్ణు కూడా నాకెందుకు అని సైలెంట్ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మైనారిటీ నేత.. ఫలితాల తర్వాత వ్యాపారంపై ఫోకస్ పెట్టారు. సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్‌కు అంబటిని మర్చినప్పటికి.. ఆయన స్థానంలో సత్తెనపల్లికి ఇంకా కొత్త నేతను కేటాయించలేదు. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓడిన కంబాల జోగులు కూడా సైలెంట్‌గా రాజాం వెళ్లిపోయారు. టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ వాణి, పేరాడ తిలక్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇచ్ఛాపురం సమన్వయకర్తగా ఎవరినీ నియమించలేదు. గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిన వల్లభనేని వంశీ జైలులో ఉన్నారు. ఆయనను మారుస్తారనే మాట ఇటీవల బాగా వినిపించినప్పటికీ.. అలా ఏం జరగలేదు. రాజధాని పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నేత ఎవరో జగన్‌కు ఇప్పటి వరకు దొరకలేదు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి మేకతోటి సుచరిత పోటీ చేసి ఓడారు. నాటి నుంచి ఆమె హైదరాబాద్‌కే పరిమితమయ్యారు తప్ప.. అటు తాడికొండ, ఇటు ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఎక్కడా కనిపించటం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. తాము ఎవరి ఆధ్వర్యంలో పని చేయాలి అనేది ఇప్పుడు ప్రతి కార్యకర్త ఎదుట ఉన్న ప్రశ్న. ఆ విషయం తేల్చకుండా.. జగన్ తొందరపడ్డారని సొంత పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నారు. ఓడిపోయిన వారిని యాక్టివ్ కూడా చేయలేదు. పోనీ.. పాతవారిని తిరిగి వారి వారి స్థానాలకు కూడా పంపించలేదు.ఇంతలోనే ఇంటింటికీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించడం ఏమిటంటున్నారు.