గత ప్రభుత్వానికి… వ్యాపారవేత్త గౌతం అదానీకి జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందనే అంశంపై అమెరికాలో కేసు నమోదు అయిన నేపధ్యంలో… ఈ అంశంపై విచారణకు ఆదేశించాలి అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… ఏపీ గవర్నర్ ను కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె… జగన్, ఆదాని మధ్య అవినీతి డీల్ మీద గవర్నర్ కి పిర్యాదు చేశామన్నారు. ఈ డీల్ వల్ల ఆంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని… ఈ డీల్ ను రద్దు చేయాలని అడిగామన్నారు. దర్యాప్తు జరిపించాలని కోరామని పేర్కొన్నారు.
Also Read : అమరావతిపై మళ్ళీ వైసీపీ విష ప్రచారం..!
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారం..లాభం అధానికి అంటూ కామెంట్ చేసారు. అదానీ కి లాభం కోసమే ఈ డీల్ అన్నారు షర్మిల. ఈ డీల్ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారన్నారు. రాబోయే 25 ఏళ్లు ఈ డీల్ అంటే వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లే అని వ్యాఖ్యానించారు. ప్రజలకు నష్టం వచ్చినా పర్వాలేదు..కానీ అదానీ కి లాభం కావాలి అంటూ మండిపడ్డారు. ఇదే సెకి తో గుజరాత్ 1.99 పైసలకు ఒప్పందం చేసుకుందని… కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం 2.49 పైసలు చేసుకుందని మండిపడ్డారు. మొత్తంగా యూనిట్ కి 5 రూపాయలు పడుతుందన్నారు.
ఈ డీల్ వల్ల లక్షల కోట్ల భారం పడుతుందని ఆరోపించారు. ఇలాంటి ముడుపుల డీల్స్ వల్ల ప్రజలపై విద్యుత్ భారం అయిందన్నారు. ఇప్పటికే 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీలు వేసారని ఇంత జరిగినా రాష్ట్రం కానీ,కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదని మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నాం అని నిలదీశారు. మన దేశంలో జరిగిన అవినీతి అమెరికా లో బయట పడిందన్నారు. ఇక్కడ దర్యాప్తు సంస్థలు అన్ని అదానీ చేతుల్లో ఉన్నాయన్న ఆమె… అన్ని వ్యవస్థలను అదానీ గుప్పెట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు.
Also Read : పవన్ ని జాతీయ స్థాయిలో వాడబోతున్నారా…?
అమెరికా ద్వారా ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసిందన్న ఆమె ఇది సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో మన పరువు పోయిందన్న ఆమె వీళ్ళ అవినీతి గురించి ప్రపంచం చర్చ చేస్తుందని ఆరోపించారు. అదానీ దేశం పరువు తీశాడు..జగన్ రాష్ట్రం పరువు తీశాడన్నారు. అమెరికాలో చర్యలకు అక్కడ కోర్టులు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు. అరెస్టు లకు సిద్ధం అవుతున్నారన్నారు. కానీ మన ప్రభుత్వం కనీసం ఒక్క చర్య కూడా లేదని పేర్కొన్నారు. జగన్ తప్పు చేయకపోతే తన పిల్లలపై ప్రమాణం చేయాలని ఆమె డిమాండ్ చేసారు. జగన్ ముడుపులు తీసుకున్నాడు అని అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అదానీ తో నేరుగా ముడుపులు మాట్లాడుకున్నారు అని ఆధారాలు ఉన్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. అదానీ కలిసిన వెంటనే సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయన్నారు. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారు… జగన్ అవినీతి పరుడు కాకపోతే బిడ్డల మీద ప్రమాణం చేయండి అని ఆమె డిమాండ్ చేసారు. లంచాలు తీసుకోక పోతే మీరే ఒక విచారణ జరపాలని కోరండని సవాల్ చేసారు.