అధికారంలో ఉన్నప్పుడు నా అంత వాడు లేడని రెచ్చిపోవటం.. నాకు ఎదురే లేదని చెలరేగిపోవడం.. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనటం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరు. అలా వ్యవహరించినందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. చివరికి ప్రతిపక్ష కూడా ఇవ్వలేదు. దీంతో చేసిన తప్పులు ఎక్కడ ఎత్తి చూపిస్తారనే భయంతో అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏడాది కాలంగా అప్పుడప్పుడు ఏపీలో పర్యటిస్తున్నారు. వినుకొండ, రాప్తాడు, పొదిలి, తెనాలి, సత్తెనపల్లిలో పర్యటించిన సమయంలో పోలీసులు, అధికారులపై నోరు పారేసుకున్నారు. దీంతో ఎస్సై స్థాయి అధికారి కూడా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే.. జగన్ తీరులో మాత్రం అస్సలు మార్పు రాలేదు.
రాజకీయ నేతలకు ముందుగా ఉండాల్సింది సంస్కారం. అది లేని రోజున ఆ నేతకు భవిష్యత్తు లేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఇదే మాట ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఏ స్థాయి నేత అయినా సరే.. ఎదుటి వారిని గౌరవించాల్సిందే. అధికారంలో ఉన్నా.. లేకున్నా కూడా మాట తీరులో మార్పు రాకూడదు. కార్యకర్త మొదలు.. అధినేత వరకు ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి నేతల పట్ల అయితే హుందాగా వ్యవహరించాలి. సాటి వ్యక్తిని మనం ఎలా పిలుస్తామో.. మనకు కూడా అదే మర్యాద ఇస్తారు. కానీ ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో నేతలు ఉపయోగిస్తున్న భాష పూర్తిగా దిగజారిపోయింది. ఇందుకు ప్రధాన కారణం భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్యకర్తలను, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ఇతర నేతలు కూడా నాటి టీడీపీ ప్రభుత్వంపైన, అధికారులపైన బూతులతో రెచ్చిపోయారు.
Also Read : అదరగొడుతున్న పెమ్మసాని స్పీచ్ లు
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇదే తీరు కొనసాగింది. మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి.. అసెంబ్లీలోనే వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్. ఇవి అప్పట్లో పెద్ద దుమారం రేపాయి కూడా. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ నోటికి బ్రేక్ పడలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు. కేసీఆర్ అండతో వైసీపీ అధినేత జగన్ కూడా రెచ్చిపోయారు. చంద్రబాబును కాల్చి చంపాలన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌లో హుందాతనం రాలేదు. చంద్రబాబును ముసలోడు అన్నారు. పవన్ పైన, లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంపై పదే పదే విమర్శలు చేశారు. లోకేష్‌ను వైసీపీ నేతలంతా పప్పు అని బహిరంగంగానే ట్రోల్ చేశారు.
https://x.com/ysjagan/status/1939264524978131044
వాస్తవానికి వైసీపీ ఓటమికి ఆ పార్టీ నేతల నోటి దూల కూడా ఒక కారణం. మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, జోగి రమేష్, పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పల్రాజు, అంజాద్ బాషా వంటి నేతలతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వ హననం చేశారు. బుద్ది చెప్పాల్సిన అధినేత కట్టు తప్పితే.. కార్యకర్తలు, అనుచరులు మాత్రం పద్ధతిగా ఎలా ఉంటారు.. వాళ్లు కూడా రెచ్చిపోయారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రెచ్చిపోయారు. దాడులు చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే దిగజారిపోయిన వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి సమస్యలను ప్రస్తావిస్తున్నప్పుడు కూడా సంస్కారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో అసలు సమస్య గాలికి వదిలేసినట్లు అవుతుంది.
Also Read : కొడాలి అనుచరుల పెత్తనం.. ఆయన మాటే వేదం..!
విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని.. రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఏపీఈసెట్ అడ్మిషన్లే దీనికి ఉదాహరణ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో ఏపీ విద్యా శాఖ మంత్రి లోకేష్‌ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్య.. ఆయన దిగజారుడు తనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. “అమాత్య మేలుకో.. పప్పు నిద్ర వదులు” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనికి లోకేష్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారు.. అని మర్యాద పూర్వకంగా బదులిచ్చారు. మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. ఏడాదిలోనే నేను అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం అని జవాబిచ్చారు.
అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. పప్పు, గిప్పు అని నోరు పారేసుకున్నందుకే 11 స్థానాలకు దిగజారిపోయారు. ఇలాగే మాట్లాడితే.. పులివెందులలో కూడా తరిమేస్తారు జాగ్రత్త అంటున్నారు. గన్నేరు పప్పు గారు.. బెంగళూరు ప్యాలెస్‌లో పడుకుని ట్వీట్లు వేస్తున్నారా.. అని ట్రోల్ చేస్తున్నారు. పప్పు ఎవరో రాష్ట్రం మొత్తం తెలిసిపోయిందని.. 11 స్థానాలైనా ఈసారి కాపాడుకుంటారా మీరు.. అని కౌంటర్ ట్వీట్లు వేస్తున్నారు. ఒక్క సంస్కార రహితమైన పదాన్ని వాడిన జగన్‌కు.. చివరికి అదే బూమ్‌రాంగ్‌గా మారిపోయింది. మనం ఒకటి అంటే.. అటు వైపు నుంచి పది తిట్లు గిఫ్ట్‌గా వస్తున్నాయని వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు.