వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు జరుగుతాయా.. ప్రస్తుతం ఉన్న నేతలను జగన్ మారుస్తారా.. ఇప్పటి వరకు పార్టీలో కీలకంగా ఉన్న నేతలను జగన్ తప్పిస్తారా.. ఈ ప్రశ్నలకు అవుననే మాటే వినిపిస్తోంది. వై నాట్ 175 అని గొప్పలు చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే రావడంతో అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఇక టీడీపీ నేతలపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేస్తున్నప్పటికీ.. ఎక్కడా ప్రత్యక్ష పోరాటం పాల్గొనలేదు. చివరికి పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో కూడా జగన్ కనిపించలేదు. జగన్ తీరుపై అసహనంతో ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీ మారిపోయారు. చివరికి తొలి నుంచి జగన్ వెంటే ఉన్న విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు.
Also Read : ఫిక్సింగ్ జరిగిందా.. ముంబైపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్
ఇక జగన్ తీరుపై ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కూడా అసహనం మొదలైంది. ఇందుకు ప్రధానంగా జగన్ వ్యవహరిస్తున్న తీరు. ఎన్నికలకు ముందే సొంత కుటుంబ సభ్యులను దూరం పెట్టారు. ఇక ఎన్నికల తర్వాత కూడా ఆస్తి కోసం కన్నతల్లి, సొంత చెల్లికి లాయర్ నోటీసులు పంపారు. ఇది వైసీపీపై పెద్ద ప్రభావమే చూపించింది. వైసీపీకి ప్రజల్లో నెగిటివ్ అభిప్రాయానికి దారి తీసింది. అధికారం కోసమే సొంత తల్లి, చెల్లిని వాడుకున్నాడని.. డబ్బు కోసం వాళ్లిద్దరినీ తరిమేశారని వైసీపీ అధినేతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలంతా ఒకటే మాట చెప్పారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ చేరిందని.. అందుకే వైసీపీ ఓడిందని కూడా వ్యాఖ్యానించారు. కొందరైతే పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావించారు. అయినా సరే.. జగన్ మాత్రం మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డికే కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. దీనిపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేశారు.
Also Read : గరం గరం గన్నవరం..!
ఇక కడప మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహం వచ్చిందనేది వాస్తవం. ప్రత్యర్థులను కట్టడి చేయడం, ప్రజలకు వాస్తవాలు వివరించడంతో పాటు పార్టీ గొంతును బలంగా వినిపించడం వంటి అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇదే విషయాలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం కూడా చేశారు. అలాగే పార్టీ తీర్మానాల్లో కూడా సింపుల్‌గా ఆరు మాత్రమే తయారు చేశారు. కార్యకర్తలే అధినేత అంటూ చేసిన తీర్మానం ఇప్పుడు మిగిలిన పార్టీల్లో కూడా గుబులు రేపుతోంది. పార్టీలో ప్రతి ఒక్కరికీ పదవులు రావాలనేది మంత్రి నారా లోకేష్ మాట. ఆ దిశగానే చర్యలు చేపట్టారు కూడా. అందుకే కొందరు సీనియర్లను పక్కన పెట్టారు. తొలిసారి గెలిచిన వారిని మంత్రులను చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కూడా హాట్ టాపిక్.
Also Read : 18 ఏళ్ళలో తొలిసారి.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త రికార్డు
మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు ఎప్పుడని మాత్రమే వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే.. కూటమి ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులా మిగిలిన పనులను పూర్తి చేస్తోందన్నారు. ఎన్నికల ఏడాది అన్నట్లుగా వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు చేశారని కూడా వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలను సర్కార్ అమలు చేస్తుంటే.. ఇంకా వాటిపైనే ఫోకస్ పెట్టడం వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అవుతుందనేది కొందరు వైసీపీ నేతల మాట. ఇక మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం టీడీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహం నింపింది. పొత్తుపై ఫుల్ క్లారిటీగా వివరించారు. రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల త్యాగాల గురించి ప్రస్తావించారు. కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఒకటికి రెండుసార్లు వెల్లడించారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్లో అసహనానికి గురి చేస్తోంది.
Also Read :కోవర్టులు.. వలస పక్షులు.. బీ కేర్ ఫుల్..!
పాదయాత్ర సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కార్యకర్తల గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. పరదాలు కట్టుకుని పర్యటించారన్నారు. ఇక ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన వైసీపీ.. ప్రత్యర్థి నేతల బొమ్మలు పెట్టి.. వాటిని కొట్టించడం కూడా ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకతకు కారణం అని గుర్తు చేశారు. ఇవన్నీ కూడా కొందరు నేతలిచ్చిన సలహాల వల్లే అని పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ గొంతు బలంంగా వినిపించే నేతలు ప్రస్తుతం వైసీపీలో కనిపించటంలేదు. అధినేత కూడా మొక్కుబడి మీటింగ్‌తో సరిపెడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీ మనుగడ కష్టమే అంటున్నారు సొంత పార్టీ నేతలు. వైసీపీలో మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.