ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇంకా చెప్పాలంటే ఓటమికి కారణాలు కూడా విశ్లేషించలేని పరిస్థితికి చేరుకున్నాడు. వాస్తవానికి జగన్ ఓటమికి ప్రధాన కారణం నేతలు, కార్యకర్తలను దూరం చేసుకోవడమే. కేవలం కొందరినే తన చుట్టూ పెట్టుకున్న జగన్.. వారి మాట ప్రకారమే ఐదేళ్లు పరిపాలన సాగించాడు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మా ఓటర్లు వేరే అని చెప్పడంలోనే వైసీపీ నేతల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే తమను గెలిపిస్తాయని జగన్‌తో పాటు వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
Also Read : తెలుగోడికి పెర్త్ లో ఛాన్స్…?
అయితే అవే సంక్షేమ పథకాలు జగన్ పార్టీని ఘోరంగా ఓడించాయి. అదే సమయంలో కొందరు నేతల అభిప్రాయాలను జగన్ ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఇది కూడా వైసీపీ ఓటమికి కారణం. ఓటమి తర్వాత జగన్‌లో మార్పు వస్తుందని అంతా భావించారు. కానీ ఐదు నెలల తర్వాత ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. అలాంటిదేం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ అదే తరహా ఒంటెత్తు పోకడలతో ముందుకు పోతున్నారు జగన్. ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండానే నేతలను నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా నియమిస్తున్నారు.
Also Read : తిరుమలలో సంచలనాత్మక మార్పులకు బిఆర్ నాయుడు శ్రీకారం
ఎన్నికలకు సరిగ్గా 5 నెలల ముందు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను యర్రగొండపాలెం నుంచి కొండపి నియోజకవర్గానికి మార్చారు. అప్పటికే ఎన్నికకో నియోజకవర్గం మారుస్తాడనే చెడ్డపేరున్న సురేష్.. ప్రస్తుత మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి చేతుల్లో ఓడారు. అదే సమయంలో యర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ తరఫున గెలిచారు. ఇక ఓటమి తర్వాత కొండపి నుంచి సురేష్ దుకాణం సర్దేశారు. పార్టీ కార్యాలయం, ఇల్లు ఖాళీ చేసి మార్కాపురం వెళ్లిపోయారు. మళ్లీ యర్రగొండపాలెం బాధ్యతలు అప్పగిస్తాడని జగన్‌పై గంపెడాశపెట్టుకున్నారు సురేష్.
అయితే జగన్ మాత్రం ఇప్పుడు సురేష్‌కు షాక్ ఇచ్చాడు. యర్రగొండపాలెంలో ఎలాంటి మార్పులు చేయకపోగా… కొండపి నియోజకవర్గం ఇంఛార్జ్‌ను మార్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. కొత్తగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో చెప్పాలంటూ స్థానిక నేతలకు సమాచారం పంపారట. దీంతో సురేష్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి మాదిరి తయారైంది. అటు యర్రగొండపాలెం లేకపోగా… ఇటు కొండపి కూడా దూరమైందని తన వర్గం నేతలతో సురేష్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సురేష్‌కు విబేధాలున్నాయి. దీంతో సురేష్ భవిష్యత్తు ఏమిటనే చర్చ జోరుగా నడుస్తోంది.




