పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. రిలీజ్ అయిన 12 గంటల్లోనే తెలుగులో 4 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఇప్పటికే సెలబ్రెటీలంతా పోస్టులు పెడుతున్నారు. ఇక పుష్ప 2 అంటే ఫైర్ కాదు… వైల్డ్ ఫైర్ అని బన్నీ ఫ్యాన్స్ దుమ్ము రేపుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ… పుష్ప పేరుతో అల్లు అర్జున్‌ను సొంతం చేసుకునేందుకు పొలిటికల్ వార్‌కు తెరలేపారు వైసీపీ సోషల్ మీడియా టీమ్. అసలు రాజకీయాలకు సినిమాలకు ఏమిటీ సంబంధం… సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చినా కూడా అన్ని పార్టీలో అభిమానులుంటారు.
Also Read : జగన్ సభకు రావాలంటే… ఇలా చేయాలంట…!
నందమూరి తారక రామారావుకు తెలుగుదేశం పార్టీలోనే కాదు… యావత్ ప్రపంచంలో పార్టీలకు అతీతంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా… కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించినా సరే… ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. బాలకృష్ణ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సరే… వైసీపీలో కూడా బాలయ్య అభిమానులున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ను సొంతం చేసుకునేందుకు వైసీపీ సోషల్ మీడియా టీమ్ తెగ తాపత్రయ పడుతోంది. ఇంకా చెప్పాలంటే పాట్నాలో నిర్వహించిన పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు.
ఇదే ఇప్పుడు వైసీపీ వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వీళ్లంతా ఎవరో పిలిస్తే రాలేదు… జస్ట్ బన్నీ కోసమే వచ్చారంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక గతంలో ఓ సినిమా ఈవెంట్‌లో బన్నీ చెప్పిన డైలాగ్‌ను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ఎక్కడికైనా వస్తా… ఎవరి కోసమో రాకుండా ఆగలేను.. అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పుష్ప 2 ఈవెంట్‌కు వాడేస్తున్నారు. ఇదంతా మొన్నటి ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల వచ్చాడు. ఆ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు…. తనకు ఏ పార్టీతో సంబంధంలేదని… శిల్పా రవి తన మిత్రుడు కావటంతో అతని కోసం మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు.
Also Read : జగన్ కి, చంద్రబాబు కి ఇంత తేడానా.. ఆశ్చర్యపోయిన మాజీ మంత్రి
అయితే ఆ సమయంలో బన్నీపై టీడీపీ, జనసేన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత బంధువును విమర్శించిన వాళ్ల తరఫున ఎలా ప్రచారం చేస్తారని నిలదీశారు. అసలు అల్లు అర్జున్‌కు ప్రత్యేక ఫ్యాన్స్ లేరన్నారు జనసేన ఎమ్మెల్యే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి కూడా. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా టీమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ… బన్నీని ఓన్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతోంది. వీళ్లంతా బన్నీ సొంత ఫ్యాన్స్ అని… ఎవరో చెబితే వచ్చిన వాళ్లు కాదంటూ పవన్ పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే… మెగా ఇమేజ్‌కు దూరంగా బన్నీ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇలాంటి వారికి బన్నీ ఎలాంటి సమాధానం చెప్తాడో వేచి చూడాలి.