అంతా మా వాళ్లే.. ఏం జరిగినా ఇట్టే మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవే మాటలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీలో 2 వేల మంది ఉద్యోగులు తమ నిఘా నేత్రాలే అంటూ భూమన వ్యాఖ్యానించారు. అలాగే అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరుకే మాయని మచ్చ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పది నెలలు గడిచింది. అయినా సరే… కూటమి నేతలు ఇంకా పట్టుసాధించలేదనే విమర్శలు ఇప్పటికే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా కూటమి పార్టీల నేతల కంటే ముందే వైసీపీ నేతలకు తెలిసిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా చాలా విషయాలు తెలియటం లేదు. కానీ వైసీపీ నేతలకు మాత్రం ఇట్టే తెలిసిపోతున్నాయి.
Also Read : మళ్ళీ సాయి రెడ్డేనా..? రాజ్యసభ ఉప ఎన్నిక సందడి షురూ
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే 3 నెలల్లోనే వందకు పైగా ఆవులు మృతి చెందాయని భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అలాగే తాను విడుదల చేసిన ఫోటోలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమే అని ప్రకటించారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి చర్యలకైనా రెడీ అంటూ భూమన సవాల్ చేశారు. ఇక్కడే పెద్ద ఎత్తున అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తిరుమలలో జరుగుతున్న విషయాలు బయటకు ఎలా వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాల్.
Also Read : విజయసాయి తర్వాత మిథున్ రెడ్డి.. వెంటాడుతున్న సిట్
ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధాలు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం నిబంధనలను తుంగలో తొక్కింది. అన్ని కీలక పోస్టుల్లో కూడా అర్హత ఉన్న వారికంటే కూడా తమకు అనుకూలంగా ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా.. అన్ని శాఖల్లో కూడా ఇదే విధానం. చివరికి వలంటీర్ ఉద్యోగుల నియామకంలో కూడా పారదర్శకతను పక్కన పెట్టి.. పార్టీ జెండా మోసిన వారికే కొలువు. అందుకే ప్రజల వ్యక్తిగత డేటాను వలంటీర్లు ప్రభుత్వానికి బదులుగా వైసీపీ సోషల్ మీడియా, ఐటీ విభాగాలకు అందించారు అనేది ప్రధాన ఆరోపణ.
Also Read : కొత్త రకం షుగర్.. యువత అలెర్ట్ గా ఉండాల్సిందే
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. టికెట్ల కుంభకోణంతో పాటు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం, వసతి గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థ, టీటీడీకి నాసిరకం సరుకుల సరఫరా, శ్రీవాణి టికెట్ల కేటాయింపులో అక్రమాలు, నిధుల దుర్వినియోగం, లడ్డూల విక్రయం, గోశాల నిర్వహణ, టీటీడీ బంగారం నిల్వ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగినవే. అయినా సరే.. వీటిల్లో ఒక్కదానిపై కూడా అప్పట్లో ఎలాంటి విచారణ జరగలేదు. పైగా ఇవన్నీ తప్పుడు ఆరోపణలని నాటి వైసీపీ పెద్దలు కొట్టిపారేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలను ప్రక్షాళన చేస్తామని.. పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఈ మాట చెప్పి ఇప్పటికే పది నెలలు గడిచిపోయింది. కానీ ఆ పారదర్శకత ఎక్కడా కనిపించటం లేదు అనేది శ్రీవారి భక్తుల ఆరోపణ. ఇందుకు ప్రధాన కారణం టీటీడీలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 2 వేల మంది ఉద్యోగులు వైసీపీ అనుకూల ఉద్యోగులే అనే మాట.
Also Read : ఏపీ పోలీస్ భేష్.. మొదటి స్థానంలో తెలంగాణా
టీటీడీలో ఇప్పటికే తమ నిఘా నేత్రాలే ఉన్నాయంటూ భూమన చేసిన వ్యాఖ్యలు… ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్ అనే చెప్పాలి. అసలు అంత మంది వైసీపీ అనుకూల ఉద్యోగులు ఎలా ఉన్నారు.. అసలు టీటీడీలోనే 2 వేల మంది ఉన్నారంటే.. ఇక మిగిలిన విభాగాల్లో ఎంత మంది ఉన్నారు… ఇలా అయితే ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసే అవకాశం ఉంటుందా.. ఇవే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే.. దాని ప్రభావం ప్రభుత్వంపైన పడుతుంది. మరి అలాంటిది ఏకంగా 2 వేల మంది కోవర్టులు ఉన్నారంటే.. ఇక భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఎలా సాధ్యం.. అసలు ఇలాంటి వేగులను ఎలా గుర్తించడం.. ఇదే ఇప్పుడు ప్రభుత్వాన్ని వెంటాడుతున్న ప్రశ్నలు.
Also Read : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్
గత ప్రభుత్వంలో పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు కూడా ఉద్యోగులు భయపడిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే రమణ దీక్షితులును వేధించారనేది వాస్తవం. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఓ ఉద్యోగిపై కేకలు వేసినందుకే ఉద్యోగులంతా తిరుపతిలోని పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్యోగుల్లో వైసీపీ కోవర్టులు ఉన్నారనే విషయం తెలిసిపోతుంది. కూటమి ప్రభుత్వాన్ని చులకన చేసేందుకు ఇలా కోవర్టుల సాయంతో జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చూపేందుకు వైసీపీ నేతలు తెగ తాపత్రయ పడుతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే.. ముందుగా కోవర్టుల పని పట్టాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో.. కోవర్టులకు చెక్ పెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి టెక్నాలజీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఇలాంటి కోవర్టులను పట్టుకోగలరా లేదా అనేది చూడాల్సి ఉంది.