సజ్జల రామకృష్ణారెడ్డి… ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అన్నీ తానే అయ్యి నడిపించారు. ఇంకా చెప్పాలంటే.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిలో ఉన్న సజ్జలను అంతా ముద్దుగా ఎస్‌ఆర్‌కే అని పిలిచారు. అలాగే సకల శాఖల మంత్రి అని కూడా సంబోధించారు. ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా సరే… అది సజ్జల చెబితేనే జరిగేది. ఇక పార్టీలో జగన్ కంటే సజ్జలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు నేతలు. అధినేత ఎప్పుడు కలుస్తాడో తెలియదు.. కాబట్టి ఏ సమస్య ఉన్నా సజ్జలకు చెబితే సరిపోతుందనేది నేతల భావన. అధినేత జగన్ కూడా సజ్జల మాటే వేదం అన్నట్లుగా ఐదేళ్లు సాగించాడు. చివరికి ఉద్యోగ సంఘాల నేతలను కూడా లైవ్ ప్రెస్‌మీట్‌లోనే ఫోన్ చేసి కంట్రోల్‌లో ఉండండి అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన లీడర్ సజ్జల.
Also Read : ఏపీలో కొత్త ఫిలిం పాలసీ.. కొత్త మార్పులు ఇవే..!
పార్టీ ఘోర పరాజయం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిపైనే ప్రధానంగా నేతలంతా ఆరోపణలు చేశారు. పార్టీ వదిలిన సీనియర్ నేతలు, జగన్ సన్నిహితులు సైతం సజ్జల వల్లే ఓడిపోయామని బహిరంగంగానే విమర్శలు చేశారు. అయినా సరే… అవేవీ లెక్క చేయని జగన్… మరోసారి పార్టీ కో ఆర్డినేటర్ బాధ్యతలను సజ్జలకు అప్పగించారు జగన్. సీనియర్ నేతలుగా ఉన్న రీజనల్ కో ఆర్డినేటర్లు కూడా తమ నివేదికలను సజ్జలకే రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే తాజాగా పార్టీ నేతలతో సజ్జల సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read : తగ్గేదె లే అంటున్న మెగా – అల్లు ఫ్యామిలీస్…!
ఆలు లేదు… సూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అనే సామెత మాదిరిగా… కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది. అంటే ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. అయినా సరే… వైసీపీ మాత్రం టార్గెట్ ఎలక్షన్ అన్నట్లుగా ఇప్పటి నుంచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సరే… వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయం అని పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు తెరలేపాయి. అసలు ముందస్తు మాటే లేదని ఓ వైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే… సజ్జల మాత్రం.. ఇప్పటి నుంచే ఎన్నికల గురించి మాట్లాడటం ఏమిటని గుసగుసలాడుతున్నారు. అసలు ఇప్పట్లో ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని… అయినా సరే.. పాలనలో లోపాల గురించి చర్చించకుండా.. ఇప్పటి నుంచే ఎన్నికలపై చర్చ ఎందుకనేది నేతల మాట. అసలు ఇలా అయితే ఎలా.. అని సొంత పార్టీ నేతలే సజ్జల తీరుపై విమర్శలు చేస్తున్నారు.




