వైసీపీ మళ్లీ ఊపిరి పీల్చుకుంటోంది. ఇందుకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారు. జగన్ ఆదేశాలను అమలు చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకున్న జగన్.. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో సైలెంట్‌గా బెంగళూరు ప్యాలెస్‌కు మకాం మార్చేశారు. ఆ తర్వాత అడపాదడపా తాడేపల్లికి వస్తున్న జగన్.. ఏదో మొక్కుబడిగా కూటమి సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. అసెంబ్లీకి మాత్రం వెళ్లడం లేదు. ఇక అధినేతపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే విమర్శలు చేస్తున్నారు. అలాగే పార్టీకి రాజీనామా చేసిన మాజీలు కూడా జగన్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ మనుగడే కష్టంగా ఉంటుందని జగన్ భావించారు.
Also Read : సునీత విలియమ్స్ జీతం ఎంత..? ఈ 9 నెలలకు ఆమె ఎంత తీసుకుంటుంది..?
పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని వైసీపీ అభిమానులు, కార్యకర్తలతో పాటు నాయకులు కూడా జగన్‌కు సలహాలు ఇస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఇప్పటికే 9 నెలలు గడిచింది. అయితే గతంలో నోరు పారేసుకున్న నేతలు, కార్యకర్తలపై కూటమి సర్కార్ చర్యలు చేపడుతోంది. దీంతో కేసులు, అరెస్టుల భయంతో పార్టీ నేతలెవరూ పెద్దగా బయటకు రావడం లేదు. ఏదో మొక్కుబడిగా ఓ ప్రెస్‌మీట్ పెట్టేసి మళ్లీ మాయమైపోతున్నారు. గతంలో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన కోడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఏదైనా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే… స్పందన అంతంత మాత్రంగానే ఉంది. యువత పోరుకు వైసీపీ ఇచ్చిన పిలుపులో పార్టీ నేతలు పెద్దగా పాల్గొనలేదు. యువత పోరుపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
Also Read : వైసీపీ ఎమ్మెల్సీని ఆడుకున్న మంత్రులు
పార్టీ నేతలతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులకు కీలక ఆదేశాలిచ్చారు సజ్జల. పార్టీ కమిటీలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల జాబితాలను ఈ నెలాఖరు నాటికి కేంద్ర కార్యాలయానికి పంపాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. కమిటీల ఎంపికలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కమిటీల విషయంలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని అధినేత జగన్ ఆదేశించారని కూడా సజ్జల వెల్లడించారు. యువత పోరుకు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు మొక్కుబడిగా పాల్గొన్నారని.. మరోసారి అలా జరిగితే చర్యలుంటాయని హెచ్చరించారు. కమిటీల నియామకం పూర్తయితే పార్టీ ఇచ్చిన కార్యక్రమానికి స్థానికంగా స్పందన వస్తుందని సజ్జల సూచించారు. ఇప్పటి నుంచి అయినా పార్టీ పుంజుకునేందుకు చర్యలు చేపట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.