వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా… అనే ప్రశ్న ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మాత్రమే సభకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు… గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరం చెప్పి కేవలం 11 నిమిషాల్లోనే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. రెండోరోజు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా అనే మాట బాగా వినిపిస్తోంది. సభకు 60 రోజుల పాటు హాజరు కాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించాల్సి వస్తుందని ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలతో పాటు క్యాడర్‌లో కూడా ఉప ఎన్నికలు వస్తాయా అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వీళ్ళే..?
వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో సభకు హాజరయ్యేందుకు ముఖం చెల్లలేదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అటు ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు వంటి కొందరు నేతలు కూడా అసెంబ్లీలోనే సెటైర్లు వేశారు. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు ఎన్నిక సమయంలో మీరు ఆ సీటులో ఉండాలి… ఓ వ్యక్తి అవతల కూర్చోవాలి… నాకు ఓ గంట మాట్లాడే అవకాశం రావాలి… అంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వైరల్‌గా మారాయి కూడా. అంటే జగన్ సర్కార్‌లో తీవ్ర ఇబ్బందులు పడిన నేతల్లో అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణరాజు, అచ్చెన్నాయుడు టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇప్పుడు వారిలో స్పీకర్‌గా అయ్యన్న, డిప్యూటీ స్థానంలో రఘురామ సభను నడిపిస్తున్నారు. దీంతో వారిద్దరినీ జగన్ ఇప్పుడు అధ్యక్ష అనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : బయటపడుతున్న వంశీ పాపాలు
వాస్తవానికి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ నాలుగున్నరేళ్ల పాటు జగన్‌కు రచ్చబండ పేరుతో చుక్కలు చూపించారు రఘురామ కృష్ణరాజు. దీంతో రఘురామపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఎంపీలు ఎంతో ప్రయత్నం చేశారు. పార్లమెంట్ స్పీకర్‌కు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. చివరికి భీమవరంలో ప్రధాని మోదీ పర్యటనకు కూడా స్థానిక ఎంపీ హాజరుకాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే జగన్‌కు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం తక్కువగా వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే.
Also Read: పవన్ పై లోకేష్ ప్రసంశలు..
ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో.. కేవలం ఓ పార్టీ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం మాత్రం వస్తుందని ఇప్పటికే టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. దీంతో పెద్దగా సమయం రాదు… అదే సమయంలో తన హయాంలో జరిగిన అక్రమాలు బయటకు తీసి.. అసెంబ్లీలో కడిగేస్తారనే భయంతో అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ భయపడుతున్నారనేది కూటమి నేతల మాట. అయితే అధ్యక్ష అని ఒక్కసారి కూడా అనకపోతే… అనర్హత వేటుతో ఇంట్లో ఉండాల్సి వస్తుందనేది కూటమి నేతల మాట. మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరవుతాడా… లేదా అనేది చూడాల్సి ఉంది.