ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతలు ఇప్పుడు ఏ దిశగా అడుగులు వేస్తారు అనేది ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఆ పార్టీ బలహీనంగా ఉండటంతో పలువురు నేతలు స్వచ్చందంగా బయటకు వస్తుంటే.. దువ్వాడ శ్రీనివాస్ లాంటి నాయకులను సస్పెండ్ చేస్తోంది వైసీపీ. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ను అధిష్టానం సస్పెండ్ చేయగా ఆయన.. బహిరంగంగానే విమర్శలు చేసారు. మొన్నటి వరకు జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన ఆయన ఇప్పుడు జగన్ పై నేరుగానే విమర్శలు గుప్పించారు.
Also Read : జూన్ నెలలో పేలనున్న లిక్కర్ బాంబు..?
ఇక ఇప్పుడు సైలెంట్ గా ఉన్న దువ్వాడ తన రాజకీయ ప్రయాణం విషయంలో ఏం చెయ్యాలా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న దువ్వాడ బిజెపి వైపు అడుగులు వేయడానికి సిద్దమవుతున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బిజెపిలోకి వెళ్తే ఖచ్చితంగా తనకు ప్రయోజనం ఉంటుంది అనే భావనలో దువ్వాడ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బిజెపిలో ఉత్తరాంధ్రలో ఉన్న కీలక నేతతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
Also Read : బాలీవుడ్ మాఫియాను లెఫ్ట్ లెగ్‌తో తన్నిన సందీప్ రెడ్డి
అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎంత వరకు ఆయన చేరికను స్వాగతిస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. రాజకీయంగా బిజెపి ఏపీలో పాగా వేయాలి అని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. వ్యక్తిగతంగా వివాదాస్పద నేతగా పేరున్న దువ్వాడను పార్టీలోకి తీసుకుంటే అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉండవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. జనసేన, టీడీపీలోకి ఆయనకు ప్రవేశం లేదు కాబట్టి.. దువ్వాడ ఏం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.




