“బలహీనుడిపై బలం చూపిస్తూ బలవంతులం అనుకుంటూ ఉంటారు కొందరు” ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ విషయంలో జరుగుతుంది ఇదే. సినిమా వాళ్ళు అందరూ మంత్రి గారు చేసిన కామెంట్స్ చాలా తప్పు, ఆమె అలా మాట్లాడటం మహా పాపం, చూస్తూ కూర్చునేది లేదు అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు, బాధ్యత గురించి, వ్యక్తిగత జీవితాల గురించి, హద్దులు, సరిహద్దులు, పరిధి ఇలా “పెద్ద పెద్ద” మాటలు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, నానీ ఇలా ఒక్కొక్కరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేసి మంత్రి గారికి సలహాలు, వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు.
ఇదే సినిమా పెద్ద మనుషులు గతంలో… గతం కూడా కాదు నాలుగు నెలల క్రితం వరకు… సాటి సినిమా వాడి పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి, ముఖ్యమంత్రి హోదాలో, మంత్రుల హోదాల్లో, ఎమ్మెల్యేల హోదాల్లో ఉండి స్థాయి మరిచి ప్రవర్తించినప్పుడు ఏ ఒక్కడు బయటకు వచ్చి ఇది తప్పు మాట్లాడకండి అనలేదు. కార్లు, పెళ్ళాలు అంటూ బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు వార్నింగ్ లు ఇవ్వలేదు. జుగుప్సల గురించి మాట్లాడలేదు. పైగా మీరు తల్లి స్థానంలో ఉన్నారంటూ చేతులు జోడించి స్థాయి మరిచి, కారు గేటు దగ్గరే ఆపితే నడుచుకుంటూ వెళ్లి వేడుకున్నారు.
Read Also : హైడ్రాను వ్యూహాత్మకంగా డైవర్ట్ చేసారా…?
విడాకులు అనేది అందరికి వ్యక్తిగతమే. ఎవడికీ బజారులో వస్తువు కాదు. వాళ్ళ వ్యక్తిగత సమస్య వాళ్లకు తెలుసు. దాని గురించి రాజకీయ నాయకులు మాట్లాడటం తప్పు. కాని అప్పుడు వైసీపీ ఇదేం ఫాలో కాలేదు. కొండా సురేఖ ఒక్కసారి మాత్రమే ఆ కామెంట్స్ చేసినందుకు రచ్చ చేస్తున్నారు. కాని ఏ ఒక్క హీరో గారు కూడా పవన్ కళ్యాణ్ ను దిగజార్చి మాట్లాడుతుంటే కనీసం ఇది తప్పు అని పోస్ట్ పెట్టె ప్రయత్నం చేయలేదు. మెగా కుటుంబం ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది… ఆ రోజు పవన్ కళ్యాణ్ ను అన్నప్పుడు ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
ఎవరో హీరోయిన్ ని అంటే స్పందించిన చిరంజీవి… సొంత తమ్ముడి గురించి బహిరంగ వేదికలపై మాట్లాడుతుంటే ఎలా మౌనంగా ఉన్నారు…? పైగా వెళ్లి దండాలు, నమస్కారాలు, శాలువాలు కప్పించుకున్నారు కప్పారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా భువనేశ్వరిని అసెంబ్లీ వేదికగా నానా మాటలు అన్నప్పుడు కనీసం పేరు కూడా పలకకుండా వీడియో విడుదల చేసాడు. స్పందిస్తే అన్ని సమయాల్లోనూ ఉండాలి, అందరివి వ్యక్తిగత జీవితాలే అని గ్రహించాలి. అలా కాకుండా కొందరే మహిళలు కొందరే బాధితులు, వాళ్ళకే వ్యక్తిగత జీవితాలు అనుకుంటే సమాజంలో చులకన అవుతారు. అప్పుడు జగన్ బలవంతుడు కాబట్టి వీళ్ళ ధైర్యం అక్కడ చెల్లలేదు. ఇప్పుడు సురేఖ బలహీనురాలు కాబట్టి ఫైర్ అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.